అమెరికాలో రెమిటెన్సులపై పన్ను.. ఎన్నారైలకు సెగ..! | New US tax may cost Indians 1. 6 billion dollers | Sakshi
Sakshi News home page

అమెరికాలో రెమిటెన్సులపై పన్ను.. ఎన్నారైలకు సెగ..!

May 17 2025 6:26 AM | Updated on May 17 2025 6:26 AM

New US tax may cost Indians 1. 6 billion dollers

1.6 బిలియన్‌ డాలర్ల భారం అంచనా 

న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న విదేశీయులు స్వదేశాలకు పంపే రెమిటెన్సులపై 5 శాతం ట్యాక్స్‌ విధించాలన్న ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదన అక్కడి ప్రవాస భారతీయులకు సమస్యగా పరిణమించనుంది. దీని వల్ల వారు భారత్‌కి నిధులు పంపించడానికి సంబంధించిన వ్యయాలు పెరగనున్నాయి. ఇటీవలి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్టికల్‌లో ప్రస్తావించిన 2023–24 డేటా ప్రకారం ఏకంగా 1.6 బిలియన్‌ డాలర్ల మేర భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 సదరు కథనం ప్రకారం వివిధ దేశాల నుంచి 2010–11లో రెమిటెన్సులు 55.6 బిలియన్‌ డాలర్ల నుంచి 2023–24లో రెట్టింపై 118.7 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇందులో అమెరికా వాటా 27.7 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా నుంచి 32.9 బిలియన్‌ డాలర్లు రెమిటెన్సుల రూపంలో వచ్చాయి. దీనిపై 5 శాతం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ విధిస్తే 1.64 బిలియన్‌ డాలర్ల పన్ను భారం పడుతుందని అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధానంగా దృష్టి పెడుతున్న ప్రతిపాదన ప్రకారం గ్రీన్‌ కార్డులు, హెచ్‌1బీ వీసాలపై ఉన్న వారు సహా మొత్తం 4 కోట్ల మందిపై 5 శాతం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ భారం పడనుంది. ఇది అమెరికన్‌ పౌరులకు వర్తించదు.  

టాప్‌లో భారత్‌.. 
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం అత్యధిక స్థాయిలో రెమిటెన్సులను అందుకోవడంలో 2008 నుంచి భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాల మధ్య 2001లో 11 శాతంగా ఉన్న భారత్‌ వాటా 2024లో 14 శాతానికి పెరిగింది. 2024లో 129 బిలియన్‌ డాలర్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, మెక్సికో (68 బిలియన్‌ డాలర్లు), చైనా (48 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (40 బిలియన్‌ డాలర్లు), పాకిస్తాన్‌ (33 బిలియన్‌ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement