నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు | Neeta Ambani Showcases India Jamdani Heritage At TIME 100 Summit In New York, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

Apr 23 2026 11:20 AM | Updated on Apr 23 2026 11:52 AM

Neeta Ambani Showcases India Jamdani Heritage at TIME 100 Summit New York

అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని, కళా వారసత్వాన్ని చాటిచెప్పడంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘టైమ్‌ 100’ శిఖరాగ్ర సదస్సులో ఆమె ధరించిన చేనేత వస్త్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఆ ‘జమ్దానీ’ చీర వెనుక రెండేళ్ల కష్టం దాగి ఉండటం విశేషం.

పశ్చిమ బెంగాల్‌లోని ఫులియాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బీరేన్ కుమార్ బసక్ ఈ చీరను రూపొందించారు. దీని తయారీకి దాదాపు 24 నెలల సమయం పట్టింది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన, క్లిష్టమైన ‘జమ్దానీ’ నేత పద్ధతిలో దీన్ని తయారు చేశారు. మీనకారీ జమ్దానీ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ వస్త్రంపై విభిన్న రకాల డిజైన్‌లు చేశారు.

కళాత్మకత - సంస్కృతీ చిహ్నాలు

ఈ చీర పల్లూ (కొంగు) ఒక దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. ఇందులో భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్సవ దృశ్యాలు, మానవ ఆకృతులు, జంతువులు, ప్రకృతి సౌందర్యాన్ని చాటే పచ్చని ఆకులు అల్లారు. చీర అంచు వెంబడి ఉన్న చేపల ముద్రలు భారతీయ సంప్రదాయం ప్రకారం శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ చీర రాజసానికి, హుందాతనానికి ప్రతీకగా నిలిచింది.

నీతా అంబానీ సందేశం

ఏప్రిల్ 22న జరిగిన ఈ సదస్సులో టైమ్ మ్యాగజైన్ సీఈఓ జెస్సికా సిబ్లీ నీతా అంబానీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ భారతీయ విలువల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రపంచానికి హార్డ్‌ పవర్‌ కంటే, సున్నితమైన శక్తి(సాఫ్ట్‌ పవర్‌) ఎంతో అవసరం. భారతదేశం ఆ మృదువైన శక్తికి నిలువెత్తు ప్రతిరూపం’ అని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

nita ambani1
1/4

nita ambani2
2/4

nita ambani3
3/4

nita ambani4
4/4

Advertisement
 
Advertisement
Advertisement