ఆచితూచి రుణాలివ్వండి..! | Sakshi
Sakshi News home page

ఆచితూచి రుణాలివ్వండి..!

Published Fri, Nov 24 2023 4:37 AM

NBFCs should remain cautious on lending; need not go too far in their enthusiasm - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ సూచించిన విధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు రుణ వితరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఎర్రటి గీతను (హద్దులను/పరిమితులను) గౌరవించాలని, అత్యుత్సాహంతో దూకుడుగా వ్యవహరించరాదని కోరారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డ్‌ రుణ విభాగంలో (అన్‌సెక్యూర్డ్‌) బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు గడిచిన కొన్నేళ్లలో భారీ వృద్ధిని చూపిస్తుండడం తెలిసిందే.

ఫలితంగా ఈ విభాగంలో ఎన్‌పీఏలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రిస్క్‌ నియంత్రణకు గాను ఆర్‌బీఐ ఇటీవలే నిబంధనలు కఠినతరం చేయడం తెలిసే ఉంటుంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డ్‌ల రుణాలకు గాను రిస్క్‌ వెయిటేజీని 0.25 శాతం మేర పెంచింది. దీనివల్ల బ్యాంకుల వరకే రూ.84,000 కోట్లను అదనంగా పక్కన పెట్టాల్సి రావచ్చని అంచనా.

‘డేట్‌ విత్‌ టెక్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఉత్సాహం మంచిదే. కానీ, కొన్ని సందర్భాల్లో ఇదీ మరీ ఎక్కువైతే జీర్ణించుకోవడం కష్టం. దీంతో జాగ్రత్తగా ఉండాలని, దూకుడుగా వ్యవహరించడం ద్వారా తర్వాత రిస్‌్కలు చవిచూడొద్దన్న ఉద్దేశంతోనే ఆర్‌బీఐ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలను అప్రమత్తం చేసింది’’అని మంత్రి సీతారామన్‌ వివరించారు.  

డేటా సురక్షితం
అకౌంట్‌ అగ్రిగేటర్లతో (ఏఏ) పంచుకునే కస్టమర్ల డేటా దేశంలో పూర్తి సురక్షితంగా ఉంటుందని మంత్రి సీతారామన్‌ హామీనిచ్చారు. డేటా భద్రత విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేశారు. ‘‘అకౌంట్‌ అగ్రిగేటర్లు డేటా బ్యాంక్‌ కలిగి ఉంటారనే అభిప్రాయాలు ఉండేవి. నిజానికి వారు డేటా కలిగి ఉండరు. వారి ద్వారా డేటా బదిలీ అవుతుంది. ఏఏ ద్వారా బ్యాంక్‌ కానీ, కస్టమర్‌ కానీ డేటా కలిగి ఉండరు. కేవలం రుణాల మంజూరీకే దీన్ని వినియోగించుకుంటారు’’అని మంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement