NASA: ప్రమాదకరమైన ఆస్టరాయిడ్‌.. ఇవాళ రాత్రి ఆకాశంలో వీక్షించే అవకాశం!

Nasa Says Hazardous Asteroid Speeding To Approach Earth On Aug 21 - Sakshi

Asteroid 2016 AJ193 Speed To Earth: ‘భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాలు..’ చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, అంతరిక్ష పరిశోధకులకు మాత్రం ఇదో ఆసక్తికరమైన అంశం. కారణం.. విశ్వం ఆవిర్భావానికి, డైనోసార్ల శకం ముగియడానికి, గ్రహాల ఏర్పాటుకు, విశ్వంలోని ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్‌లతోనే ముడిపడి ఉందన్న థియరీకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల.. దూసుకొచ్చే ప్రతీదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడింది శాస్త్రవేత్తలకు. ఈ తరుణంలో.. భూమ్మీదకు వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. 

2016 ఏజే193గా పేరు పెట్టిన ఓ ఆస్టరాయిడ్‌..  గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. నాసా అంచనాల ప్రకారం.. ఆగష్టు 21న(అంటే ఇవాళే) అది భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సుమారు కిలోమీటర్‌న్నర వెడల్పు ఉన్న శకలం.. అత్యంత ప్రమాదకరమైన శకలంగా నాసా గుర్తించింది.  ఇది భూమిని ఢీకొడితే మాత్రం కచ్చితంగా భారీ డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారికి ఆ అవకాశాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేశారు. 

చదవండి: వందేళ్ల తర్వాత బెన్నూ ముప్పు!

భూమికి దూరంగా (భూమి-చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి తొమ్మిది రెట్లు దూరంగా) ఈ శకలం వెళ్లనుంది. ఈ లెక్కన భూమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని టెలిస్కోప్‌ల ద్వారా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2063లో మరోసారి ఇది భూమికి దగ్గరగా రానుందని అంచనా వేస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్‌ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top