Jio: ఆ క్రెడిట్‌ అంతా ఆమెదే! జియో ఆలోచనకు బీజం పడిందిలా..

Mukesh Ambani gave credit inception of Jio was actually his daughter Isha idea - Sakshi

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ ఏది అంటే రిలయన్స్‌ జియో అని టక్కున చెప్పేస్తాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 2023 డిసెంబర్‌లో 3.99 మిలియన్ల మంది యాజర్లను సంపాదించి అతిపెద్ద విజేతగా నిలిచింది. దీంతో జియో  సబ్‌స్క్రైబర్ బేస్ 459.81 మిలియన్లకు పెరిగింది. అయితే ఈ జియో ఏర్పాటుకు బీజం ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం..

దేశంలో అత్యంత సంపన్నుడు, దేశ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన టెలికాం దిగ్గజం జియో వెనుక ఉన్న ముఖేష్ అంబానీ.. 2018లో లండన్‌లో జరిగిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్‌లో తన అంగీకార ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఆ క్రెడిట్‌ ఇషాదే..
2011లో జియోను ప్రారంభించడం వెనుక తన కుమార్తె ఇషా అంబానీ ఉన్నారని, ఆ క్రెడిట్‌ అంతా ఆమెదే అని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు. అప్పుడు యేల్‌లో చదువుతున్న ఇషా అంబానీ సెలవులకు ఇంటికి వచ్చింది. వారి నివాసంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం ఆమెను అసహనానికి గురి చేసింది. అదే కోట్లాది మంది భారతీయులకు సరసమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే సంచలనాత్మక ఆలోచనకు దారితీసింది.

 

ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఇలా పంచుకున్నారు. "2011లో నా కుమార్తె ఇషా ద్వారా జియో ఆలోచనకు బీజం పడింది. ఆమె యేల్‌లో చదువుకుంటున్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చింది. కోర్స్‌వర్క్‌ చేసుకుంటుండగా ఇంట్లో ఇంటర్నెట్ సక్రమంగా రాలేదు. దీంతో 'నాన్న , మన ఇంట్లో ఇంటర్నెట్ పోయింది' అని చెప్పింది" అని అంబానీ చెప్పుకొచ్చారు.

తన పిల్లలు ఇషా, ఆకాష్‌లు.. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రపంచ స్థాయిలో రాణించడానికి పోటీ పడుతున తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకొచ్చిన ముఖేష్‌ అంబానీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అనేది దేశానికి అత్యంత ఆవశ్యకరమైన అంశమని తనను వారే ఒప్పించారని వివరించారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top