
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిలుస్తుందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత సాయుధ దళాలు సరిహద్దు అవతలి నుండి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వం, అసమాన శక్తితో ప్రతిస్పందించాయని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో భాగంగా రిలయన్స్ కుటుంబం ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.