పాలసీ రేట్ల పాజ్‌తో వృద్ధికి ఊతం  | MPC repo rate pause will help stabilise growth says SBI chairman | Sakshi
Sakshi News home page

పాలసీ రేట్ల పాజ్‌తో వృద్ధికి ఊతం 

Jun 4 2026 12:56 AM | Updated on Jun 4 2026 12:56 AM

MPC repo rate pause will help stabilise growth says SBI chairman

ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి అంచనా 

ముంబై: ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకు కట్టుబడితే నిలకడైన ఆర్థిక వృద్ధికి వీలుంటుందని పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) చైర్మన్‌ సీఎస్‌ శెట్టి అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పాలసీ రేట్ల విషయంలో స్టేటస్‌ కో అమలు చేయవచ్చని అత్యధిక శాతంమంది అంచనా వేస్తున్నట్లు సిటీ 2026 ఇండియా సదస్సులో పాల్గొన్న శెట్టి పేర్కొన్నారు. 

వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తే నిలకడైన వృద్ధికి కచ్చితంగా ఇది సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ పబ్లిక్‌ ఇష్యూపై స్పందిస్తూ ప్రస్తుత క్యాలండర్‌ ఏడాది(2026)లో లిస్టింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలియజేశారు.   

బ్యాంకింగ్‌పై.. 
అన్ని విభాగాలకూ బ్యాంకింగ్‌ సర్వీసులను విస్తరించడం, సంస్థాగత నైపుణ్యం పెంచుకోవడం, మారుతున్న కస్టమర్ల అవసరాలను లోతుగా అర్ధం చేసుకోవడం, టెక్నాలజీ, డేటా, ఏఐను వినియోగించుకోవడం తదితర కొన్ని కీలక అంశాల ఆధారంగా భవిష్యత్‌ బ్యాంకింగ్‌ విధానం ఉండాలని శెట్టి సూచించారు. తద్వారా దేశ ఆశయాలకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మద్దతివ్వగలుగుతుందని తెలియజేశారు. కాగా.. వార్తా సంస్థ పీటీఐ ఇటీవల ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై 15 మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులతో నిర్వహించిన సర్వేలో 11 మంది రేట్ల పాజ్‌నే అంచనా వేయడం గమనార్హం! ద్రవ్యోల్బణ రిసు్కల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో రేట్ల పెంపును చేపట్టే వీలున్నట్లు సర్వేలో అత్యధిక శాతం మంది భావించారు.  

Advertisement
 
Advertisement
Advertisement