భారత్‌లో డిమాండ్‌ ఉన్న టాప్‌-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?

The Most In Demand Jobs in india Right Now - Sakshi

నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి

వివిధ రంగాల్లో మారిన ప్రాధాన్యతలు 

లింక్డ్‌ఇన్‌ డేటా విడుదల  

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్‌ఇన్‌ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్‌కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్‌ ఎవల్యూషన్‌ 2022’, ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ స్కిల్స్‌ 2022’ డేటాను లింక్డ్‌ఇన్‌ విడుదల చేసింది. లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్‌10 నైపుణ్యాలు, భవిష్యత్‌ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది.  

భారత్‌లో వీటికి డిమాండ్‌.. 
భారత్‌లో డిమాండ్‌ ఉన్న టాప్‌-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్‌ఇన్‌ తెలియజేసింది. బిజినెస్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్‌క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్‌ మేనేజ్‌మెంట్, మైక్రోసాఫ్ట్‌ అజూర్, స్ప్రింగ్‌బూట్‌ డిమాండ్‌ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్‌ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్‌ రంగంలో.. జీఎస్‌టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్‌ నెలకొంది. సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్‌లైన్‌ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో), వెబ్‌ కంటెంట్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటింగ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్‌ బ్యాంకింగ్, బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ నైపుణ్యాలకు ఫైనాన్షియల్‌లో డిమాండ్‌ నెలకొంది. అంటే ఆఫ్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్‌కేర్‌ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top