‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! | Indian Techie’s Moonlighting Confession Goes Viral, High Salary And Zero Social Life | Sakshi
Sakshi News home page

‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Apr 23 2026 2:35 PM | Updated on Apr 23 2026 3:21 PM

Moonlighting in Indian IT huge Money Empty Social Life

భారతీయ ఐటీ రంగంలో ‘మూన్‌లైటింగ్’ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం) అనేది ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే. కంపెనీలు దీన్ని అనైతికం అని కొట్టిపారేస్తున్నా కొందరు టెక్కీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కాసులు సంపాదిస్తున్నారు. అయితే, ఈ సంపాదన వెనుక ఎంతటి మానసిక సంఘర్షణ, సామాజిక దూరం ఉందో వివరిస్తూ ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ఏడాదికి రూ.70 లక్షలకు పైగా సంపాదన.. రూ.1.3 కోట్ల ఇల్లు.. కానీ నా సామాజిక జీవితం శూన్యం’ అంటూ సదరు టెక్కీ వెళ్లగక్కిన ఆవేదన ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అప్పు చేయకుండా రూ.1.3 కోట్ల ఇల్లు!

టైర్-3 సిటీలో 2022 బ్యాచ్ నాన్-ట్రెడిషనల్ ఇంజినీరింగ్ విభాగంలో చదివిన ఈ యువకుడు కేవలం నాలుగేళ్లలోనే కళ్లు చెదిరే స్థాయికి ఎదిగాడు. పైథాన్, బ్యాకెండ్ సిస్టమ్స్, ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్‌లో నైపుణ్యం సాధించి ఒకేసారి రెండు రిమోట్ (వర్క్‌ ఫ్రం హోం) ఉద్యోగాలను సంపాదించాడు. అందులో ఒకటి భారతీయ స్టార్టప్‌దికాగా, మరొకటి అమెరికాకు చెందిన ఎంఎన్‌సీ. తన సంపాదన ఏడాదికి రూ.74.5 లక్షలు. ఏ విధమైన హోమ్ లోన్ లేకుండా రూ.1.3 కోట్లతో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు.

తీవ్ర పని ఒత్తిడి!

తన జీవితం పైకి అంతా కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ టెక్కీ నరకం చూస్తున్నాడు. ఒక ఉద్యోగానికి రోజుకు నాలుగు గంటలు, రెండో ఉద్యోగానికి 10 గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వచ్చేది. ‘రెండు రిమోట్ ఉద్యోగాలే కాబట్టి మేనేజ్ చేయగలిగాను కానీ, నా సామాజిక జీవితం కనుమరుగైపోయింది. ఫ్యామిలీకి, స్నేహితులకు సమయం ఇవ్వలేకపోయాను. నేను కొనుక్కున్న జిమ్ సామాగ్రిని వాడే తీరిక కూడా లేదు’ అని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. చివరికి ఆరోగ్యం దెబ్బతినడం, ఒంటరితనం వేధించడంతో ఒక ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. పని ఒత్తిడితోపాటు ఆదాయ పన్ను లెక్కలు కూడా తన నిర్ణయానికి కారణమయ్యాయి.

నెటిజన్ల మిశ్రమ స్పందన

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని కష్టాన్ని చూసి లెజెండ్ అని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ‘ఇంత డబ్బు ఉండి ఏం లాభం? యవ్వనాన్ని గదిలోనే గడిపేస్తే జీవితానికి అర్థం ఏముంది?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతం భారతీయ టెక్ ప్రపంచంలో పెరుగుతున్న హస్టిల్ కల్చర్ (విశ్రాంతి లేకుండా పని చేయడం)కు నిదర్శనం. ఆస్తులు కూడబెట్టడం ముఖ్యం కాదని ఎవరూ అనరు, కానీ అది మానసిక ఆరోగ్యానికి సమాధి కట్టేలా ఉండకూడదు. డబ్బు కంటే లైఫ్ ముఖ్యమని గుర్తించిన ఈ టెక్కీ నిర్ణయం అతిగా కష్టపడే యువతకు ఒక హెచ్చరిక లాంటిదే!

ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement