విదేశీ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలపై పీఎల్‌ఐ స్కీం దెబ్బ!

Mobile imports down 33% in FY22 - Sakshi

ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా మొబైల్స్‌ తయారీకి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఫలితమిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2021–22లో మొబైల్‌ ఫోన్ల దిగుమతులు 33 శాతం తగ్గాయి. అదే సమయంలో స్థానిక ఉత్పత్తి 26 శాతం పెరిగింది. ఈ వివరాలను ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది.

2016 నుంచి 2021 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీ వార్షికంగా 33 శాతం మేర వృద్ధిని చూపించగా..2021–22లో ఇది 24–26 శాతమే ఉన్నట్టు వివరించింది. చిప్‌లకు కొరత ఏర్పడినప్పటికీ మూడు అంతర్జాతీయ తయారీ కంపెనీలు పీఎల్‌ఐ పథకం కింద లక్ష్యానికి అనుగుణంగా ఫోన్లను ఉత్పత్తి చేసినట్టు తెలిపింది. దానివల్లే మెరుగైన వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగుతుందని.. 2022– 2024 మధ్య ఏటా 22–26 శాతం మేర స్థానిక మొబైల్‌ ఫోన్ల తయారీ నమోదు కావచ్చని అంచనా వేసింది. విలువ పరంగా రూ.4–4.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 

విడిభాగాల దిగుమతి 
దేశీ తయారీ విస్తరించడంతో మొబైల్‌ ఫోన్లు/విడిభాగాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడడం 2020–21లో 64 శాతంగా ఉంటే, అది గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి తగ్గినట్టు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. మధ్య కాలానికి ఇది ఇంకా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. దేశీయంగా ఫోన్ల తయారీ పెరగడం వల్ల విడిభాగాల దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో 27 శాతం పెరిగాయని వెల్లడించింది.   

అంతర్జాతీయ మార్కెట్లో దిగువన 
అంతర్జాతీయ మార్కెట్‌కు ఫోన్ల సరఫరాలో భారత్‌ ఒక శాతంలోపే వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్‌ నివేదిక వివరించింది. ఈ మార్కెట్‌ను 70 శాతం వాటాతో చైనా శాసిస్తుంటే, వియత్నాం 16 శాతం వాటా కలిగి ఉంది. జపాన్‌ డిమాండ్‌లో భారత్‌ ఎగుమతులు 1 శాతం, జర్మనీ దిగుమతుల్లో 3 శాతం, యూఏఈ దిగుమతుల్లో 9 శాతం మేర ఉండడం గమనార్హం. అమెరికా (20శాతం), హాంగ్‌కాంగ్‌ (15 శాతం), జపాన్‌ (6), జర్మనీ, యూఏఈ టాప్‌–5 ఫోన్ల దిగుమతి మార్కెట్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్‌లో సింహ భాగాన్ని చైనా, వియత్నాం తీరుస్తున్నాయి. భారత్‌ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 56 శాతం పెరిగాయి. 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.–1.2 లక్షల కోట్లకు ఎగుమతులు చేరుకోవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. మన దేశం నుంచి ఎక్కువగా రూ.10వేల లోపు విలువైన ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top