
టెక్ దిగ్గజాలు వరుస పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా సత్య నాదళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీతాలు, జాబ్ సెక్యూరిటీ పరంగా ఐటీ జాబ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాలను పోలుస్తూ చర్చ నడుస్తోంది. అమెరికాలోని ఈ సంస్థలో పనిచేస్తున్న తన సోదరుణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పోస్ట్ దానికి గూగుల్ కు చెందిన ఇంజినీర్ ప్రతిస్పందన వైరల్‌గా మారాయి.
మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌ల (Microsoft Layoffs) నేపథ్యంలో స్నేహ అనే మహిళ ‘ఎక్స్’లో ఓ పోస్ట్‌పెట్టారు. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్‌ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ అనేది స్థిరంగా ఉండే ర రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని, కనీసం అక్కడ ఉద్యగ భద్రత అయినా ఉంటుందని మా పెద్దవాళ్లు చెబుతుంటారు’ అంటూ రాసుకొచ్చారు.
బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజనీరు రాహుల్ రాణా ఈ పోస్టకు ప్రతిస్పిందించారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే భావనను ఆయన తిప్పికొట్టారు. టెక్ పరిశ్రమలో అధిక సంపాదన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటుందని వాదించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలంలో సంపాదించే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని టెక్ ఉద్యోగి కొన్ని సంవత్సరాలలోనే సంపాదించవచ్చని చెప్పుకొచ్చారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మరికొంత మంది యూజర్లు ప్రతిస్పందించారు. టెక్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను బేరీజు వేస్తూ, ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు , కెరీర్ స్థిరత్వంపై తమ దృక్పథాలను పంచుకున్నారు. తన వాదనలను మరింత పెంచుతూ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించి గణనీయమైన ప్రయోజనాలను అందించగలవని, గృహనిర్మాణం, విద్యుత్తు, ఇతర సౌకర్యాల అలవెన్సులతో సహా, ఇది గణనీయమైన సంపద సేకరణకు దారితీస్తుందని స్నేహ పేర్కొన్నారు.