క్రాష్‌ మార్కెట్‌ | Market deep in red: Sensex tanks 1066 pts and Nifty below 25232 | Sakshi
Sakshi News home page

క్రాష్‌ మార్కెట్‌

Jan 21 2026 1:23 AM | Updated on Jan 21 2026 1:23 AM

Market deep in red: Sensex tanks 1066 pts and Nifty below 25232

రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి 

1,066 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

83 వేల స్థాయిని కోల్పోయిన ఇండెక్స్‌ 

నిఫ్టీకి 353 పాయింట్ల నష్టం 

మూడు నెలల కనిష్టానికి సూచీలు

ముంబై: అమెరికా, ఐరోపా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్‌ అనిశ్చితి  దలాల్‌ స్ట్రీట్‌ను వణికించాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ పతనం ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 1,066 పాయింట్లు పతనమైన 83 వేల స్థాయి కింద 82,180 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్‌ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు దిగివచి్చంది. 

రోజంతా నష్టాల ట్రేడింగ్‌: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఏ దశలోనూ కోలుకోలేక రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,235 పాయింట్లు క్షీణించి 82,011 వద్ద, నిఫ్టీ 414 పాయింట్లు కుప్పకూలి 25,171 వద్ద కనిష్టాలు తాకాయి.  

హెచ్‌డీఎఫ్‌సీ షేరుకు మాత్రమే లాభాలు 
సెన్సెక్స్‌ 30 షేర్లలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు మాత్రమే 0.38% స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఇదే సూచీలో ఎటర్నల్‌ 4%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.88% సన్‌ఫార్మా 3.68%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.05%, ఇండిగో 3% అత్యధికంగా నష్టపోయిన టాప్‌ 5 షేర్లు.  

అన్ని రంగాల ఇండెక్సులు డీలా
మార్కెట్లోని విస్తృత స్థాయి అమ్మకాలతో బీఎస్‌ఈలో అన్ని రంగాల ఇండెక్సులు డీలాపడ్డాయి. రియల్టీ 5.21%, సర్వీసెస్‌ 3%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.76%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 2.73%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 2.71%, టెలికమ్యూనికేషన్‌ 2.42%, ఆటో 2.36%, విద్యుత్‌ 2.23 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.74%, 2.52 శాతం క్షీణించాయి. 

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం 
ట్రంప్‌ టారిఫ్‌ భయాలు, గ్లోబల్‌ టారిఫ్‌విధానంపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి. చైనా, జపాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు 1.50% నుంచి 0.50% పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు 1% క్షీణించాయి. అమెరికా స్టాక్‌ సూచీలు ఒకటిన్నరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  

నష్టాలకు  4 కారణాలు
సూచీలకు ఐటీ షేర్ల పోటు 
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌ల కారణంగా ఐటీ రంగ కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. బలహీన ఆదాయాల ప్రకటనతో విప్రో 3%, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 7%, ఇన్ఫోసిస్‌ 1%, టీసీఎస్‌ 2% నష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ ఏకంగా 3% పతనమైంది. ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. 

ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులు 
గ్రీన్‌లాండ్‌ విషయంలో తనకు సహకరించకుంటే వాణిజ్య సుంకాలు విధిస్తానని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ టారిఫ్‌ వార్‌ భయాలు మార్కెట్లలో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. 

విదేశీ ఇన్వెస్టర్ల టేకాఫ్‌ మూడ్‌
భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ ఆగడంలేదు. సోమ, మంగళవారాల్లో రూ.6,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో 11వ రోజూ అమ్మకాలు కొనసాగాయి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలహీన పడి జీవిత కాల కనిష్ట ముగింపు 90.97 వద్ద ముగిసింది.  

పెరిగిన క్రూడ్‌; వీఐఎక్స్‌ ఇండెక్స్‌
అంతర్జాతీయంగా బ్రెంట్‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతిని సూచించే వీఐఎక్స్‌ ఇండెక్సు 4% పెరిగి 12.34 వద్దకు చేరుకుంది. దీనికి తోడు మంగళవారం ‘నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ’ కారణంగా భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement