మగవాళ్లకూ సంతాన నిరోధక మాత్రలు, ఆయన అండతో మార్కెట్‌లోకి..

Male Contraceptive Pill Soon Bill Gates Helping Fund For Research - Sakshi

Male Contraceptive Pill:ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి కదా. సేమ్‌.. మగవాళ్లకూ అలాంటి మాత్రలు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి.  ఈ తరుణంలో వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి  తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. అలాగే ఇవి మగవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీ ఆపుతాయన్నమాట.  కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ డుండీ(స్కాట్లాండ్‌) ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. 

బిల్‌గేట్స్‌ సహకారం
ఈ మాత్రలు మార్కెట్‌లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. కారణం.. ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్‌ ఈ ప్రయోగాల వెనుక ఉండడం. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. ఇందుకోసం ఫౌండేషన్‌ నుంచి 1.7 మిలియన్‌ డాలర్ల సాయం అందించింది కూడా. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉండేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందిస్తున్నట్లు డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ బర్రాత్‌ ఓ ప్రకటనలో వెలువరించాడు.

సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను మార్కెట్‌లోకి తెచ్చారు సైంటిస్టులు.  అయితే వీటి తర్వాత మెడికల్‌ సైన్స్‌లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు.. అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా  పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్‌ క్రిస్‌ చెప్తున్నాడు. అయితే సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు ఆయన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top