
తగ్గుతున్న కాసా నిష్పత్తి, ఎఫ్‌డీలు
భవిష్యత్తులో మరింత క్షీణించొచ్చు
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక
ముంబై: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో క్షీణత, కరెంట్–సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు (కాసా) తగ్గుదలతో బ్యాంక్‌లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సవాళ్లను ఎదుర్కోనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గృహ పొదుపులు అధిక రాబడులను ఆకాంక్షిస్తూ క్యాపిటల్ మార్కెట్లకు మళ్లుతుండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయంటూ కొంత కాలంగా ఆందోళనలు నెలకొనడం తెలిసిందే. వ్యవస్థ పరిణతిలో భాగంగా ఇలాంటి పరిణామం చూస్తున్నట్టు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘టర్మ్ డిపాజిట్లు, కాసా నిష్పత్తిలో గృహాల వాటా తగ్గుతోంది. డిపాజిట్ కూర్పులో నిర్మాణాత్మక మార్పును ఇది సూచిస్తోంది.
డిపాజిట్ స్థిరత్వానికి ఇది సవాలుగా మారొచ్చు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో బ్యాంకుల నిధుల వ్యయాలపైనా ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి నాటికి బ్యాంకుల డిపాజిట్లలో గృహాల వాటా 60 శాతానికి తగ్గింది. 2020 మార్చి నాటికి ఇది 64 శాతంగా ఉంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి బ్యాంకులకు ఎంతో కీలకమని, స్థిరత్వం, వ్యయాలను ఇది ప్రభావితం చేయగలదని పేర్కొంది. రానున్న కాలంలో బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుందని అంచనా వేసింది.
పెరుగుతున్న ఆర్థికేతర సంస్థల వాటా
ఆర్థికేతర సంస్థలు తమ వాటా పెంచుకుంటున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీనారాయణన్ ఎత్తిచూపుతూ.. కార్పొరేట్ డిపాజిటర్లు రేటుకు సున్నితంగా ఉంటారని, వారు స్వల్పకాలానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘నగదు లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా ఉన్నప్పుడు ఈ తరహా పరిస్థితుల్లో మరిన్ని డిపాజిట్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్యాంకులకు నిధుల వ్యయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మరింత ఆదరణకు నోచుకుంటాయి. దీంతో బ్యాంకు డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుంది’’అని నారాయణన్ వివరించారు.
బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని డిపాజిట్లపై వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై 3 శాతం వరకు బ్యాంకులు వడ్డీ కింద చెల్లిస్తుంటాయి. ఇక కరెంటు ఖాతా డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని ఇవ్వవు. దీంతో వాటికి తక్కువ వ్యయాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి. అందుకే బ్యాంకుల వృద్ధికి కాసా డిపాజిట్లను కీలకంగా పరిగణిస్తుంటారు. 2025 జూన్ చివరికి బ్యాంకుల కాసా డిపాజిట్ల నిషపత్తి 36 శాతానికి తగ్గిపోయినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది.
2022 మార్చిలో నమోదైన 42 శాతం చారిత్రక గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా సేవింగ్స్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రేట్లను తగ్గించడం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేసింది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీని ఎస్‌బీఐ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఇటీవల 2.5 శాతానికి తగ్గించడం గమనార్హం. లిక్విడిటీ పెంపు దిశగా ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్నందున సమీప కాలానికి ఈ డిపాజిట్లు స్థిరంగా వృద్ధి చెందాల్సి ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొంది.