CASA
-
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్’
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ 2025–26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో తన రుణాలు (అడ్వాన్సులు) 12% పెరిగి రూ.29.6 లక్షల కోట్లకు చేరాయని ప్రకటించింది. గత సంవత్సరం మార్చి 31 నాటికి ఇవి రూ.26.43 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 14.4% పెరిగి రూ. 31.05 లక్షల కోట్లకు చేరాయి.గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో డిపాజిట్లు రూ.27.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా) డిపాజిట్లు 12.3 శాతం వృద్ధితో రూ.9.4 లక్షల కోట్ల నుంచి రూ.10.6 లక్షల కోట్లకు పెరిగాయి. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ ‘పీరియడ్ ఎండ్ టైమ్ డిపాజిట్లు’ సుమారు రూ.20.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2025 మార్చి 31 నాటికి ఉన్న రూ.17.7 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 15.5% వృద్ధి సాధించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్–టైమ్ చైర్మన్ అతాను చక్రవర్తి మార్చి 18, 2026న ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు, విధానాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరే ఇతర కారణాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ లేఖను గవర్నెన్స్, నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ చైర్మన్ హెచ్ కే భన్వాలాకు మార్చి 17న పంపించారు. -
బంధన్ బ్యాంక్‌లో రుణాలు, డిపాజిట్ల జోరు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగానికి చెందిన బంధన్ బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన వ్యాపార గణాంకాలను ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ రుణాలు (అడ్వాన్సులు) వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,36,995 కోట్లుగా నమోదయ్యాయి.స్టాక్ ఎక్స్చేంజ్లకు సమర్పించిన తాత్కాలిక (ఆడిట్ చేయని) గణాంకాల ప్రకారం, వరుస త్రైమాసిక ప్రాతిపదికన లోన్ బుక్ 6.2 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు వార్షికంగా 10 శాతం పెరిగి రూ.1,66,344 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,51,212 కోట్లుగా ఉండగా, గత త్రైమాసికంతో (రూ.1,56,724 కోట్లు) పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది.క్యూ4లో కరెంట్ ఖాతా, సేవింగ్ ఖాతా(కాసా) డిపాజిట్లు రూ.48,751 కోట్లుగా నమోదై, వార్షికంగా 2.8 శాతం పెరిగాయి. అయితే కాసా నిష్పత్తి గత ఏడాది 31.37 శాతం నుంచి 29.31 శాతానికి తగ్గింది. రిటైల్ డిపాజిట్లు (కాసాతో సహా) 17.7 శాతం పెరిగి రూ.1,22,547 కోట్లకు చేరాయి. రిటైల్ టర్మ్ డిపాజిట్లు 30.1 శాతం పెరిగి రూ.73,796 కోట్లుగా నమోదయ్యాయి.మొత్తం డిపాజిట్లలో రిటైల్ వాటా 68.88 శాతం నుంచి 73.67 శాతానికి పెరిగింది. బల్క్ డిపాజిట్లు 6.9 శాతం తగ్గి రూ.43,797 కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్) సుమారు 131.76 శాతంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలు తాత్కాలికమైనవి, ఆడిట్ చేయనివని బ్యాంక్ స్పష్టం చేసింది. -
బ్యాంకులకు డిపాజిట్ సవాళ్లు
ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్లలో క్షీణత, కరెంట్–సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు (కాసా) తగ్గుదలతో బ్యాంక్‌లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సవాళ్లను ఎదుర్కోనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గృహ పొదుపులు అధిక రాబడులను ఆకాంక్షిస్తూ క్యాపిటల్ మార్కెట్లకు మళ్లుతుండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయంటూ కొంత కాలంగా ఆందోళనలు నెలకొనడం తెలిసిందే. వ్యవస్థ పరిణతిలో భాగంగా ఇలాంటి పరిణామం చూస్తున్నట్టు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘టర్మ్ డిపాజిట్లు, కాసా నిష్పత్తిలో గృహాల వాటా తగ్గుతోంది. డిపాజిట్ కూర్పులో నిర్మాణాత్మక మార్పును ఇది సూచిస్తోంది. డిపాజిట్ స్థిరత్వానికి ఇది సవాలుగా మారొచ్చు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో బ్యాంకుల నిధుల వ్యయాలపైనా ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి నాటికి బ్యాంకుల డిపాజిట్లలో గృహాల వాటా 60 శాతానికి తగ్గింది. 2020 మార్చి నాటికి ఇది 64 శాతంగా ఉంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి బ్యాంకులకు ఎంతో కీలకమని, స్థిరత్వం, వ్యయాలను ఇది ప్రభావితం చేయగలదని పేర్కొంది. రానున్న కాలంలో బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థికేతర సంస్థల వాటా ఆర్థికేతర సంస్థలు తమ వాటా పెంచుకుంటున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీనారాయణన్ ఎత్తిచూపుతూ.. కార్పొరేట్ డిపాజిటర్లు రేటుకు సున్నితంగా ఉంటారని, వారు స్వల్పకాలానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘నగదు లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా ఉన్నప్పుడు ఈ తరహా పరిస్థితుల్లో మరిన్ని డిపాజిట్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్యాంకులకు నిధుల వ్యయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మరింత ఆదరణకు నోచుకుంటాయి. దీంతో బ్యాంకు డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుంది’’అని నారాయణన్ వివరించారు. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని డిపాజిట్లపై వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై 3 శాతం వరకు బ్యాంకులు వడ్డీ కింద చెల్లిస్తుంటాయి. ఇక కరెంటు ఖాతా డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని ఇవ్వవు. దీంతో వాటికి తక్కువ వ్యయాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి. అందుకే బ్యాంకుల వృద్ధికి కాసా డిపాజిట్లను కీలకంగా పరిగణిస్తుంటారు. 2025 జూన్ చివరికి బ్యాంకుల కాసా డిపాజిట్ల నిషపత్తి 36 శాతానికి తగ్గిపోయినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. 2022 మార్చిలో నమోదైన 42 శాతం చారిత్రక గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా సేవింగ్స్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రేట్లను తగ్గించడం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేసింది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీని ఎస్బీఐ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఇటీవల 2.5 శాతానికి తగ్గించడం గమనార్హం. లిక్విడిటీ పెంపు దిశగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నందున సమీప కాలానికి ఈ డిపాజిట్లు స్థిరంగా వృద్ధి చెందాల్సి ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
అతిపెద్ద దేశీ బ్యాంక్‌గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ టాప్ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్‌లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్‌లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు. -
27శాతం పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం
ముంబై: ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 27% వృద్ధిని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.1,560 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.1,982 కోట్లకు చేరింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.10,146 కోట్ల నుంచి రూ.11,938 కోట్లకు పెరిగింది. ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో 3,731 కోట్ల నుంచి రూ.4,476 కోట్లకు చేరినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. కాని బ్యాంకు నికర వడ్డీ లాభదాయకత స్వల్పంగా క్షీణించగా, నిరర్ధక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ లాభదాయకత(నిమ్) 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గగా, స్థూల ఎన్పీఏ 1.04 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగింది. నికర ఎన్పీఏ 0.3 శాతం వద్ద స్థిరంగా ఉంది.


