హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్‌’ | HDFC Bank Deposits Cross Rs 31 Lakh Crore Mark | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్‌’

Apr 5 2026 1:03 PM | Updated on Apr 5 2026 1:58 PM

HDFC Bank Deposits Cross Rs 31 Lakh Crore Mark

దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ 2025–26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో తన రుణాలు (అడ్వాన్సులు) 12% పెరిగి రూ.29.6 లక్షల కోట్లకు చేరాయని ప్రకటించింది. గత సంవత్సరం మార్చి 31 నాటికి ఇవి రూ.26.43 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 14.4% పెరిగి రూ. 31.05 లక్షల కోట్లకు చేరాయి.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో డిపాజిట్లు రూ.27.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) డిపాజిట్లు 12.3 శాతం వృద్ధితో రూ.9.4 లక్షల కోట్ల నుంచి రూ.10.6 లక్షల కోట్లకు పెరిగాయి. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్‌ ‘పీరియడ్‌ ఎండ్‌ టైమ్‌ డిపాజిట్లు’ సుమారు రూ.20.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2025 మార్చి 31 నాటికి ఉన్న రూ.17.7 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 15.5% వృద్ధి సాధించాయి.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌–టైమ్‌ చైర్మన్‌ అతాను చక్రవర్తి మార్చి 18, 2026న ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు, విధానాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరే ఇతర కారణాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ లేఖను గవర్నెన్స్, నామినేషన్, రెమ్యూనరేషన్‌ కమిటీ చైర్మన్‌ హెచ్‌ కే భన్వాలాకు మార్చి 17న పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement