బంధన్‌ బ్యాంక్‌లో రుణాలు, డిపాజిట్ల జోరు | Bandhan Bank Reports Growth in Loans and Deposits for FY26 | Sakshi
Sakshi News home page

బంధన్‌ బ్యాంక్‌లో రుణాలు, డిపాజిట్ల జోరు

Apr 5 2026 9:15 AM | Updated on Apr 5 2026 9:17 AM

Bandhan Bank Reports Growth in Loans and Deposits for FY26

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగానికి చెందిన బంధన్‌ బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన వ్యాపార గణాంకాలను ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్‌ రుణాలు (అడ్వాన్సులు) వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,36,995 కోట్లుగా నమోదయ్యాయి.

స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన తాత్కాలిక (ఆడిట్‌ చేయని) గణాంకాల ప్రకారం, వరుస త్రైమాసిక ప్రాతిపదికన లోన్‌ బుక్‌ 6.2 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు వార్షికంగా 10 శాతం పెరిగి రూ.1,66,344 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,51,212 కోట్లుగా ఉండగా, గత త్రైమాసికంతో (రూ.1,56,724 కోట్లు) పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది.

క్యూ4లో కరెంట్‌ ఖాతా, సేవింగ్‌ ఖాతా(కాసా) డిపాజిట్లు రూ.48,751 కోట్లుగా నమోదై, వార్షికంగా 2.8 శాతం పెరిగాయి. అయితే కాసా నిష్పత్తి గత ఏడాది 31.37 శాతం నుంచి 29.31 శాతానికి తగ్గింది. రిటైల్‌ డిపాజిట్లు (కాసాతో సహా) 17.7 శాతం పెరిగి రూ.1,22,547 కోట్లకు చేరాయి. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లు 30.1 శాతం పెరిగి రూ.73,796 కోట్లుగా నమోదయ్యాయి.

మొత్తం డిపాజిట్లలో రిటైల్‌ వాటా 68.88 శాతం నుంచి 73.67 శాతానికి పెరిగింది. బల్క్‌ డిపాజిట్లు 6.9 శాతం తగ్గి రూ.43,797 కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి బ్యాంక్‌ లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌) సుమారు 131.76 శాతంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలు తాత్కాలికమైనవి, ఆడిట్‌ చేయనివని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement