ఆన్‌లైన్‌ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..

Lost Money Online Shopping It Is Better To Follow These - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్‌లైన్‌లోని వివిధ ప్లాట్‌ఫామ్‌ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.

1. బయోమెట్రిక్‌ ఉత్తమం..
పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్‌, ఇ-సిగ్నేచర్స్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 

2. రెండంచెల ధ్రువీకరణ..
ఆన్‌లైన్‌లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్‌వర్డ్‌తోనే కాకుండా బయోమెట్రిక​్‌, ఓటీపీ, మెయిల్, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి.  

3. రిమోట్‌ యాక్సెస్‌తో నష్టం..
మన కంప్యూటర్‌ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్‌ యాక్సెస్‌ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్‌లైన్‌ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉంది.

4. ఓటీపీని అసలు షేర్‌ చేయొద్దు..
ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్‌ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్‌లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్‌ స్కాం!)

5. పబ్లిక్‌ వైఫైతో జాగ్రత్త..
ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్‌/ ఓపెన్‌ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్‌ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్‌వర్క్‌, సొంత డివైజ్‌నే వాడాలి. 

ఆన్‌లైన్‌ షాపింగ్‌, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top