
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్‌సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ ప్రారంభించింది.
అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది.