
ఇప్పటివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎలా ఎంపిక చేసుకోవాలి?, ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?, ఇంటి నిర్మాణం కోసం కావలసిన మెటీరియల్స్ వంటి వివరాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్ని రంగాల్లోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరెలా ఉపయోగించుకోగలుతున్నారు? అనేదే ప్రశ్న. సరిగ్గా ఉపయోగించుకుంటే.. సమయాన్ని, ఖర్చుకు కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ విషయానికి వస్తే..

ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ
సాధారణంగా ఒకప్పటి నుంచి వస్తున్న పద్దతిలో ఇల్లు కట్టాలంటే.. గోడలు కట్టి నిర్మాణం చేయాల్సిందే. అయితే ప్రీఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా గోడలను లేదా ఇంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారుచేసి.. మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. ఈ విధానం ద్వారా వేస్ట్, డస్ట్ పొల్యూషన్ వంటివి చాలా వరకు తగ్గుతాయి.

3డీ ప్రింటింగ్ టెక్నాలజీ
ఈ పేరును చాలామంది వినే ఉంటారు. అయితే దీనిని ఇంటి నిర్మాణంలో కూడా ఉపయోగించుకోవచ్చనే విషయం బహుశా కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది. కంప్యూటర్లో డిజైన్ చేసి.. ఇంటి నమూనాను, కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేసి నిర్మించడానికి ఈ 3డీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కేవలం గంటల వ్యవధిలోనే మీరు ఇంటిని ధృఢంగా నిర్మించుకోవచ్చు. కార్మిక ఖర్చు తగ్గడమే కాకుండా.. మెటీరియల్ కూడా పెద్దగా వృధా అయ్యే అవకాశం లేదు.

కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అనేది.. ఇంటి నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఖర్చు తగ్గించుకోవడం, మెటీరియల్ మేనేజ్‌మెంట్, సైట్ మానిటరింగ్ కోసం ఉపయోగించే డిజిటల్ టూల్స్. ఇల్లు కట్టుకోక ముందే.. కట్టుకోబోయే ఇల్లు ఎలా ఉంటుందో దీని ద్వారా చూడవచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో ముందుగానే బడ్జెట్ అంచనా వేయవచ్చు.

గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ
గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ ద్వారా.. పర్యావరణానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేయవచ్చు. ప్రకృతి వనరులను సంరక్షించుకుంటూ.. సోలార్ పానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి నిర్మించుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు నిర్మించుకునే ఇంటిలోకి సహజంగా కాంతి, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ టెక్నాలజీ ఉపయోగించి కార్బన్ ఉద్గారాలను చాలావరకు తగ్గించుకోవచ్చు.

ఏఐ & స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్
ఈ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ చాలా అవసరం, అందరూ ఇష్టపడతారు కారు. ఇంట్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్, టీవీ, ఏసీ, డోర్ లాక్స్, సీసీటీవీ కెమరాలు అన్ని కూడా ఏఐ ఆధారంగా.. ఆటోమేటెడ్‌గా పనిచేసేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఇంట్లో లేకపోయినా, అవసరం అనుకుంటే, లైట్స్ ఆన్ చేయడం.. లేదా ఆఫ్ చేయడం, డోర్ బెల్స్ మోగినప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారో ముందుగానే చూడటానికి ఏఐ ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్స్