బిల్డర్ నిర్మాణాన్ని పూర్తి చేయగానే కొనుగోలుదారుల్లో పలు సందేహాలు నెలకొంటాయి. ఎప్పటిలోగా బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను అప్పగించాలి? అతడి నుంచి ఏయే పత్రాలు తీసుకోవాలి? సంఘం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి? వీటిపై అవగాహన పెంచుకుంటేనే బదిలీ ప్రక్రియ ఎంతో సులువుగా జరుగుతుంది.
అపార్ట్‌మెంట్ చిన్నదైనా, పెద్దదైనా.. లగ్జరీ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం పూర్తవగానే ఫ్లాట్లు కొన్నవారంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్ ప్రతిపాదించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సంఘం పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ మొత్తాన్ని అందులో జమ చేయాలి. నిర్మాణానికి సంబంధించిన కీలకమైన పత్రాలను బిల్డర్ నుంచి తప్పకుండా తీసుకోవాలి.
బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే..
➤బిల్డింగ్ ప్లాన్, అప్రూవల్ ప్లాన్
➤కంప్లీషన్ సర్టిఫికెట్
➤ఆమోదం పొందిన ఫ్లోర్ ప్లాన్లు
➤పొల్యుషన్ బోర్డు, విద్యుత్తు, జలమండలి, ఫైర్ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు
➤విద్యుత్, తాగునీరు వంటి కనెక్షన్లు
➤రిజిస్ట్రేషన్ పత్రాలు, అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డ్రాయింగులు
➤కార్పస్‌ఫండ్, అన్ని సౌకర్యాలను సంఘానికి బిల్డర్ బదిలీ చేయాలి
ఓసీ తప్పనిసరి..
నగరంలో అపార్ట్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూకట్‌పల్లి, నిజాంపేట, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మదీనాగూడ, తెల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, కోకాపేట, నార్సింగి వంటి నగరం నలువైపులా అనేక అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి కాగానే బిల్డర్ స్థానిక సంస్థ(జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ) నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) తీసుకోవాలి. ఈ ఓసీ వచ్చాక సుమారు రెండేళ్ల వరకు బిల్డర్ అపార్ట్‌మెంట్ నిర్వహణ బాధ్యత తీసుకోవచ్చు.
సాధారణ శుభ్రత, భద్రత, బిల్లుల చెల్లింపులు, ఆస్తిపన్ను చెల్లింపులు, డీజీ(డీజిల్ జెనెరేటర్) సెట్ల నిర్వహణ, నివాసితులకు కావాల్సిన ఇతరత్రా పనులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండేళ్లయ్యాక నివాసితులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్ ప్రతిపాదించాలి. ఫ్లాట్ కొన్నప్పుడు.. కొనుగోలుదారులు చెల్లించిన కార్పస్ ఫండ్‌ను బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్ ప్రకారమే బిల్డర్ నిర్మాణం చేపట్టాడని తెలియజేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థ నుంచి తీసుకోవాలి. నిర్మాణాన్ని అప్పగించేటప్పుడు బిల్డర్ నుంచి కొత్తగా ఏర్పడిన అపార్ట్‌మెంట్ సంఘం పలు పత్రాలను తప్పకుండా తీసుకోవాలి.


