
రూ. 1,700 కోట్ల సమీకరణ
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు.
తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.