Jet Airways Staff Association: ఉద్యోగులనుంచి ఎదురుదెబ్బ

Jet Airways staff association challenges resolution plan - Sakshi

ఎన్‌సీఎల్‌ఏటీకు స్టాఫ్‌ అసోసియేషన్‌

డిమాండ్ల సాధనకు వినతి

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలాప్రక్రియ సవాలు 

ముంబై: ఎయిర్‌లైన్స్‌ కోసం జలాన్‌-కల్రాక్‌ కన్సార్షియం రిజల్యూషన్‌ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌)లో అప్పీల్‌ దాఖలు చేసినట్లు ఆల్‌ ఇండియా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీసర్స్‌ అండ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్,  యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్‌ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ పరిష్కార ప్రణాళికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మరోవైపు గత వారం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ను ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్‌ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్‌ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్‌ అండ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ తాజాగా ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. బీకేస్‌,  జెట్ ఎయిర్‌వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్‌సీఎల్‌ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రస్తుతం మానిటరింగ్‌ కమిటీ నిర్వహిస్తోంది.   

అప్పీల్‌ ఎందుకంటే... 
జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తులు, ఫ్లైట్‌ స్లాట్‌లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్‌ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్‌ ఇండియా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీసర్స్‌ అండ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ పావస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్‌ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్‌ 2018 నుండి జూన్‌ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్‌ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్‌సీఎల్‌ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్‌లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

రిజల్యూషన్‌ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్‌ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్‌ రిట్రెంచ్‌మెంట్‌ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్‌ పావస్కర్‌ స్పష్టం చేశారు. రిజల్యూషన్‌ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని  జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్‌ హరిహరన్‌ అన్నారు.

కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్‌లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇంతక్రితం నరేష్‌ గోయల్, గల్ఫ్‌ క్యారియర్‌ ఎతిహాద్‌ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్‌ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.  
     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top