100 కేసులు.. 109 పరిష్కారం | Telangana High Court is demonstrating strong performance in resolving criminal cases | Sakshi
Sakshi News home page

100 కేసులు.. 109 పరిష్కారం

Aug 11 2025 2:51 AM | Updated on Aug 11 2025 2:51 AM

Telangana High Court is demonstrating strong performance in resolving criminal cases

క్రిమినల్‌ కేసుల విచారణలో హైకోర్టు రికార్డు 

వేగవంతంగా విచారణ, పరిష్కారం 

సివిల్‌ కేసుల్లోనూ పరిష్కార రేటు 94 శాతం 

సౌకర్యాలు కల్పిస్తే మరింత వేగంగా పరిష్కారం

సాక్షి, హైదరాబాద్‌: క్రిమినల్‌ కేసుల్లో తెలంగాణ హైకోర్టు సత్వర పరిష్కారం చూపిస్తోంది. సగటున నమోదైన 100 కేసులకు పాత కేసులతో కలిపి 109 కేసులను పరిష్కరిస్తోంది. సివిల్‌ కేసుల్లో 94 శాతం పరిష్కారంతో కేసుల విచారణ సాగిస్తోంది. హైకోర్టులో ఇప్పటికి దాదాపు 2.35 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 30 శాతం న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నా.. పరిష్కారం శాతంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 

కౌంటర్ల జాప్యంతో పెరుగుతున్న పెండింగ్‌లు 
కేసుల సత్వర విచారణకు న్యాయస్థానం తీవ్రంగా కృషి చేస్తున్నా.. జడ్జిల ఖాళీలు, సిబ్బంది లేమితోపాటు ప్రభుత్వం వేగంగా కౌంటర్లు వేయకపోవడంతో కొన్ని కేసులు విచారణ నత్తనడకను తలపిస్తోంది. సివిల్‌ కేసుల్లో ఏళ్లకేళ్లు కౌంటర్లు దాఖలు చేయకుండా సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తుండటం పెండింగ్‌ శాతం పెరగడానికి ప్రధాన కారణమని న్యాయమూర్తులే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం గమనార్హం.

దేశంలోని హైకోర్టుల్లో 7 లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా సిఫారసు చేయాలి. న్యాయమూర్తుల కొరతతో క్రిమినల్‌ అప్పీళ్లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను అరికట్టాల్సి ఉంది.  – సుప్రీంకోర్టు

కేసులు పెద్ద సంఖ్యలో పేరుకుపోవడం కోర్టు వ్యవస్థపై తీవ్ర భారం మోపుతుంది. ఒత్తిడి పెరగడంతో న్యాయమూర్తులు కేసులను సకాలంలో విచారించి నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. సుదీర్ఘ జాప్యం కారణంగా సాధారణ ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.  – న్యాయ నిపుణులు

ప్రధాన సమస్యలు..
న్యాయమూర్తుల ఖాళీలు, సిబ్బంది కొరత 
అంతంత మాత్రంగా మౌలిక సదుపాయాలు  
న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు 
కౌంటర్ల దాఖలుకు సర్కార్‌ ఏళ్లకేళ్లు సమయం తీసుకోవడం 
చట్టంలోని లోటుపాట్లను కొందరు అనుకూలంగా మార్చుకోవడం 
సాంకేతికతపై న్యాయవాదులకు పూ ర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం

అనుకూలతలు..
కోవిడ్‌ తర్వాత వర్చువల్‌ విధా నం అందుబాటులోకి రావడం 
లోక్‌ అదాలత్‌లపై ప్రజలను విస్తృత స్థాయిలో చైతన్యం చేయడం 
సివిల్‌ కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం 
న్యాయమూర్తులు విచారణలను వేగవంతంగా చేపడుతుండటం 
ఆన్‌లైన్‌లోనూ న్యాయవాదులు విచారణకు హాజరవు తుండటం

ఇంకా ఏం చేయాలి..
సాంకేతికతపై కక్షిదారులకు, న్యాయవాదులకు అవగాహన కల్పించడం 
ఒకే రకమైన కేసులను ఒకే చోట విచారణ చేపట్టడం 
చిన్నచిన్న విచారణలకు న్యాయవాదులకు గడువు నిర్దేశించడం 
బలమైన కారణాలుంటే తప్ప విచారణ వాయిదా వేయకుండా ఉంటడం 
 స్వల్ప కేసుల్లో వెంటవెంటనే తీర్పులు వెల్లడించడం 
కౌంటర్ల దాఖలుకు సర్కార్‌కు గడువు విధించడం

వాయిదాలు తగ్గితేనే..
ప్రధానంగా సివిల్‌ కేసుల్లో వాయిదాలు తగ్గితేనే సత్వర పరిష్కారం సాధ్యమవడంతోపాటు పెండింగ్‌ భారం తగ్గుతుంది. కొన్ని కేసులు ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ పెండింగ్‌ జాబితా పేరుకుపోతోంది. క్రిమినల్‌తో పాటు సివిల్‌ కేసులను వంద శాతానికి మించి పరిష్కారం చేయాలి. రెండేళ్లుగా జడ్జీలు సత్వర పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నా.. అదనపు భారంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మంజూరైన మేరకు న్యాయమూర్తుల నియామకం, మౌలిక వసతులు చేపడితే ఈ భారాన్ని తగ్గిస్తూ రావొచ్చు.  
– సంజీవ్‌రెడ్డి జిల్లెల్ల, హెచ్‌సీఏఏ మాజీ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement