ఐటీ కంపెనీల ముందున్న సవాల్‌ ఏంటంటే?

IT Companies facing new struggle for it professionals - Everest Group report - Sakshi

డీల్స్‌ సరే... నిపుణులేరి? 

ఐటీ  నిపుణుల కొరత

డిజిటల్‌ నిపుణుల కోసం వేట

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత పరిస్థితి. డీల్స్‌ స్థాయితో సిబ్బంది నైపుణ్యతను పోలిస్తే అసమతుల్యత ఏర్పడుతోంది. అట్రిషన్‌ కోవిడ్‌ ముందస్తు స్థాయికి 17-20 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. సిబ్బంది ఉద్యోగాలు మారుతుండడమే ఇందుకు కారణం. మహమ్మారి నేపథ్యంలో ఆధునీకరణ, డిజిటల్‌ వైపు మార్కెట్‌ దూసుకెళ్తుండడంతో కంపెనీల వ్యయాలు పెరిగాయి. కోవిడ్‌ కారణంగా మందగించిన డిమాండ్‌ను అందుకోవడానికి సంస్థలు మరింత విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్‌ నైపుణ్యాలు ఉన్న మానవ వనరుల కొరత యూఎస్, ఈయూతోపాటు ఇటీవల భారత్‌లోనూ చూస్తున్నట్టు రిసర్చ్‌ కంపెనీ ఎవరెస్ట్‌ గ్రూప్‌ చెబుతోంది.  

నిపుణుల వేట మొదలైంది.. 
కోవిడ్‌ సమయంలో సేవా సంస్థలు ఫ్రెషర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల కోతల కారణంగా కొరత మరింత తీవ్రంగా మారింది. అయితే ఉద్యోగులకు నైపుణ్య శిక్షణపై ఐటీ కంపెనీలు ఇప్పటికే దృష్టిసారించాయి. సిబ్బందిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేట మొదలు పెట్టాయి. రానున్న రోజుల్లో డిజిటల్‌ నైపుణ్యాలతోపాటు ఇతర విభాగాల్లోనూ కొరత ఏర్పడుతుందని ఎవరెస్ట్‌ గ్రూప్‌ సీఈవో పీటర్‌ బెండోర్‌ సామ్యూల్‌ తెలిపారు. కొద్ది రోజుల్లో డిజిటల్‌ విభాగంలో అట్రిషన్‌ 7–8 శాతం ఉండొచ్చని టీమ్‌లీజ్‌ అంటోంది. నియామకాలు 15–16 శాతముంటాయని జోస్యం చెబుతోంది. భారీ డీల్స్‌ చేతుల్లోకి రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా నిపుణులు ఉండడం కంపెనీల పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. 

మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి: అక్టోబరు నుంచి నియామకాలు పెరిగాయి. రిక్రూట్‌మెంట్‌ అంత క్రితంతో పోలిస్తే తక్కువే. ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రం గతంలో లేనంతగా ఉంది. అయితే ఇది స్థిరమైన విధానం కాదని అందరూ గుర్తించారని నాస్కామ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగీత గుప్త వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు వ్యాపారం తిరిగి పుంజుకుంటుండడంతో ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టుల కోసం ప్రతి కంపెనీ నియామకాలను చేపట్టాలని చూస్తున్నాయి. దీంతో నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడతాయి. ప్రధానంగా డిజిటల్‌ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. డిజిటల్‌ నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్‌ ఉంది. ఉత్తమ ఆఫర్స్‌ ఉంటాయి కాబట్టి మార్చి త్రైమాసికంలో అట్రిషన్‌ పెరుగుతుంది’ అని వివరించారు. గూగుల్‌ కెరీర్‌ సర్టిఫికేట్స్‌ ఉన్న 500 మందిని రెండేళ్లలో నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్‌ తెలిపింది. నైపుణ్యం పొందేందుకు మార్కెట్లో వనరులు ఉన్నాయని ఎడ్వెన్‌సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పెద్దిరెడ్డి రామ్మూర్తి రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిదేనని అన్నారు. 

బలమైన వృద్ధి వైపు మార్కెట్‌: ఐటీ సేవల కంపెనీల 3వ త్రైమాసికం ఫలితాలతో తక్కువ వృద్ధి నుంచి రికవరీ అయిన సంకేతాలు కనపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌  టెక్నాలజీస్, విప్రో తదితర సంస్థలు పెద్ద డీల్స్‌ను అందుకునే పనిలో ఉన్నాయి. యాక్సెంచర్‌ గణాంకాలు, ముందున్న డీల్స్‌ వెరశి 2021–22లో బలమైన వృద్ధి ఉండొచ్చని మార్కెట్‌ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాల పెంపుపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 2021–22 సంవత్సరా నికి వేతనాలు పెంపును ఇప్పటికే టీసీఎస్‌ ప్రకటించింది. ఆరు నెలల్లో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఉత్తమ పనితీరు కనబరిచేవారు సంస్థలో కొనసాగేలా కాగ్నిజెంట్‌ ప్రత్యేక బోనస్‌ ఇస్తోంది. ఒక వారం వేతనానికి సమానమైన బోనస్‌ను యాక్సెంచర్‌ ఆఫర్‌ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top