ఇన్వెస్టర్ల పంట పండింది..2రోజుల్లో రూ.4.73 లక్షల కోట్ల సంపద సృష్టి!

 Investors Became Richer By Over Rs 4.73 Lakh Crore In Two Days Of Market Rally - Sakshi

ముంబై: అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో పాటు అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో సోమవారం స్టాక్‌ సూచీలు నెల రోజుల గరిష్టంపై ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఐటీ, ఇంధన, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్‌ 760 పాయింట్లు బలపడి 54,521 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,250 స్థాయిపైన 16,279 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు.

ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. లార్జ్‌ క్యాప్‌ షేర్లతో పాటు విస్తృత స్థాయి మార్కెట్‌లో చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.844 కోట్ల షేర్లను కొన్నారు. 

ఆద్యంతం కొనుగోళ్ల కళకళ  
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ ఉదయం 308 పాయింట్లు లాభంతో  54,069 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు పెరిగి 16,151 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 796 పాయింట్లు ఎగసి 54,556 వద్ద, నిఫ్టీ 239 పాయింట్లు దూసుకెళ్లి 16,288 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి.  

సూచీలకు లాభాలు ఇందుకే...! 
యూఎస్‌ రిటైల్‌ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్‌ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 2.50% లాభపడ్డాయి. ఆసియాలో సోమవారం ఆయా దేశాల స్టాక్‌ సూచీలు 2%, యూరప్‌ మార్కెట్లు ఒకశాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ మార్కెట్లు సానుకూల సంకేతాలను అందుకున్నాయి. అధిక వెయిటేజీ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు రెండు శాతం రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఇటీవల దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) విక్రయాల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు తాజాగా రూ.156 కోట్ల షేర్లను కొన్నారు.

రెండు రోజుల్లో రూ.4.73 లక్షల కోట్లు  
గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్‌ సూచీ 1105 పాయింట్లు దూసుకెళ్లడంతో బీఎస్‌ఈలో రూ.4.73 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒకటిన్నర శాతం రాణించడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.42 లక్షలు పెరిగి రూ.255.39 లక్షల కోట్లకు చేరింది. 

మార్కెట్‌లో మరిన్ని సంగతులు

∙ముడిచమురు ధరల రికవరీ రిలయన్స్‌ షేరుకు కలిసొచ్చింది. బీఎస్‌ఈలో ఒకశాతం లాభపడి రూ.2,422 వద్ద స్థిరపడింది. 

∙ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో బలమైన పనితీరు కనబరిచినప్పటికీ.., షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకశాతం నష్టంతో రూ.1,348 వద్ద నిలిచింది.  

∙దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు విమాన ఇంధన ధరను 2.2 శాతం మేర తగ్గించడంతో విమానయాన షేర్లు లాభాల్లో పయనించాయి. స్పైస్‌జెట్, ఇండిగో, జెట్‌ఎయిర్‌వేస్‌ షేర్లు ఆరుశాతం వరకు ర్యాలీ చేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top