చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం

Interest rates on small savings schemes unchanged for first quarter of FY23 - Sakshi

న్యూఢిల్లీ:  పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే.

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది.  

కొన్ని పథకాల రేట్లు ఇలా...
► పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది.  
► నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%.
► ఏడాది డిపాజిట్‌ స్కీమ్‌ 5.5% వడ్డీ ఆఫర్‌ చేస్తోంది
► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది.  
► ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది.  
► సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది.  
► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది.  
► ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీ 5.8%.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top