క్యూ4లో రూ. 8,501 కోట్లు
షేరుకి రూ. 25 డివిడెండ్
ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21% జంప్‌చేసి రూ. 8,501 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 7,033 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13% బలపడి రూ. 46,402 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,925 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
గైడెన్స్ ఓకే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఆదాయంలో 1.5–3.5 శాతం మధ్య పురోగతిని సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, యుటిలిటీస్, ఏఐ సర్వీసులు దోహదపడగలవని పేర్కొంది. కొత్త ఏడాది పటిష్టంగా ప్రారంభమైనట్లు కంపెనీ తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు కుదురుకుంటున్నాయని తెలియజేసింది.
పూర్తి ఏడాదికి గుడ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 29,440 కోట్లను తాకింది. 2024–25లో రూ. 26,713 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం వృద్ధితో రూ. 1,78,650 కోట్లకు చేరింది.
ఇతర విశేషాలు...
→ క్యూ4లో 3.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ పొందింది. పూర్తి ఏడాదికి 14.9 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్త డీల్స్.
→ క్యూ4లో 8,440 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,28,594కు పరిమితమైంది. అయితే 2024–25 క్యూ4 సంఖ్య(3,23,578)తో పోలిస్తే 5,016 మంది పెరిగారు.
→ గతేడాది మొత్తం 20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు.
→ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు జయేష్ వెల్లడించారు.
→ ఏఐ సంప్రదాయ ఐటీ సర్వీసులు, బీపీవో మోడల్స్‌కు చెక్ పెడుతున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే ఏఐ ద్వారా ఇతర సర్వీసులు పుంజుకుంటున్నట్లు పరేఖ్ పేర్కొన్నారు.
→ ప్రస్తుత సీఈవో పరేఖ్ ఐదేళ్ల పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 2% క్షీణించి రూ. 1,242 వద్ద ముగిసింది. కాగా.. యూఎస్ మార్కెట్లో ఇన్ఫీ ఏడీఆర్ 4.5% పతనమై 12.87 డాలర్లను తాకింది.
పటిష్ట వృద్ధి
ఫైనాన్షియల్, కమ్యూనికేషన్స్, తయారీ విభాగ సర్వీసులతోపాటు.. ప్రాంతాలవారీగా చూస్తే యూరప్‌లో పటిష్ట వృద్ధి సాధించాం. 2026–27లో ఏఐ సర్వీసులలో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, ఎనర్జీ, యుటిలిటీ, రీసోర్సెస్ విభాగాలలో
వృద్ధికి వీలుంది. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్


