ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు

Infosys President Mohit Joshi Resigns To Join Tech Mahindra - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఆరో అతిపెద్ద టెక్‌ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్త సీఈవోగా మోహిత్ జోషి ఎంపికయ్యారు. ప్రస్తుత సీఎండీ సీపీ గుర్నానీ స్థానంలో ఆయన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరనున్నారు. డిసెంబర్ 20నుంచి మోహిత్‌ జోషి బాధ్యతలను స్వీకరించనున్నారని టెక్‌ మహీంద్ర ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో  శనివారం ప్రకటించింది. గుర్నానీ పదవీ కాలం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో ఈ  పరిణామం చోటు చేసుకుంది.  

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి ప్రత్యర్థి టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాయి. 2000 నుండి ఇన్ఫోసిస్‌లో భాగమైన మోహిత్ జోషి 2023,మార్చి 11రాజీనామా చేశారు.జోషి మార్చి 11 నుండి సెలవులో ఉంటారని, జూన్ 9 చివరి తేదీ అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే మోహిత్ జోషి డిసెంబర్ 2023 నుండి 5 (ఐదు) సంవత్సరాలపాటు 2028 వరకు  పదవిలో ఉంటారని  టెక్‌  ఎం  వెల్లడించింది. 

ఇన్పీ ఫైనాన్షియల్ సర్వీసెస్  అండ్‌ హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపార హెడ్‌గా పనిచేసిన  జోషికి ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ మరియు కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌లో, జోషి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. అలాగే ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌తో పాటు, ABN AMRO,  ANZ Grindlays వంటి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడా పనిచేశారు. సీబీఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ) ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్‌గా  సేవలందించారు. Aviva Plcలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను,  రిస్క్ అండ్‌  గవర్నెన్స్  నామినేషన్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానితుడు కూడా. మోహిత్ జోషి ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top