
ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలి
ఐసీఈఏ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ తయారీని ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కోరింది. 2030–31 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ తయారీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది.
కేవలం ప్రోడక్టుల తయారీకే పరిమితం కాకుండా ఫ్యాక్టరీలు, నగరాలు, రవాణా నెట్‌వర్క్‌లు మొదలైన వాటిని ఆటోమేట్ చేసేందుకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తే ఎల్రక్టానిక్స్ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని వివరించింది.
ఈ నేపథ్యంలో ఇండ్రస్టియల్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. ’ప్రతి అధునాతన తయారీ సెటప్‌కి ఇది మెదడు, నాడీమండలం లాంటిది. తయారీ రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలంటే, పారిశ్రామిక ఆటోమేషన్‌లో అగ్రగామిగా ఎదగాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.
భారీగా ఉద్యోగావకాశాలు..
పారిశ్రామిక ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్‌కి సంబంధించి ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్, ఏఐ ఆధారిత సిస్టమ్స్ మొదలైన విభాగాల్లో నిపుణులకు భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయని మహీంద్రూ చెప్పారు. ఈ విభాగం మరింతగా అభివృద్ధి చెందేలా నిపుణులను తీర్చిదిద్దడంపై, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఆధునిక తయారీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇండస్ట్రియల్ ఎల్రక్టానిక్స్ సాంకేతికంగా వెన్నెముకలాంటిదని డెల్టా ఎల్రక్టానిక్స్ వీపీ మనీష్ వాలియా తెలిపారు. స్మార్ట్ ఫ్యాక్టరీలు, రోబోటిక్స్, ఇంటెలిజెంట్ గ్రిడ్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు ఉండే రవాణా, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లకు ఇది దన్నుగా నిలుస్తుందని వివరించారు.