‘మనుషుల్లో రెండే జాతులు.. ఒకటి పేదలు, రెండోది ధనికులు’.. ఇది చాలా సినిమాల్లో మనకు వినిపించే డైలాగు. కానీ దీనికి భిన్నంగా ధనికుల్లోనూ ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని, ఒక దేశంలో ధనికుల జీవన ప్రమాణాలు, మరో దేశంలోని పేదల కంటే తక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. దీని ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ధనికులదీ పేద బతుకే!
భారత్‌లో అత్యంత సంపన్నులుగా ఉన్నవారి జీవన ప్రమాణాలు.. అభివృద్ధి చెందిన దేశాల్లోని పేదల జీవన ప్రమాణాలతో పోలిస్తే కూడా తక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశాల మధ్య ఆదాయ పంపిణీ, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాల్లో ఉన్న అంతరాలను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో అత్యంత ధనిక 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం లేదా వినియోగ స్థాయితో పోలిస్తే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని సంపన్నుల స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
భారత్‌లో టాప్ 10 శాతం ఆదాయం రోజుకు 10 డాలర్లే!
ప్రపంచ బ్యాంకు 2026 పేదరికం, అసమానతల వేదిక (Poverty and Inequality Platform) గణాంకాల ప్రకారం.. భారత్‌లో అత్యల్ప ఆదాయ వర్గంలోని 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం లేదా వినియోగ స్థాయి ఒక్కొక్కరికి సుమారు 3 డాలర్లుగా ఉంది. ఇదే కొలమానంలో అమెరికాలో ఈ స్థాయి 25 డాలర్లు, కెనడాలో 31 డాలర్లు, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో 28 డాలర్లుగా నమోదైంది. అంటే ఆయా సంపన్న దేశాల్లో దిగువ ఆదాయ వర్గాల జీవన ప్రమాణాలు కూడా భారత్‌లోని పేదలతో పోలిస్తే గణనీయంగా మెరుగ్గా ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
మరోవైపు.. భారత్‌లో అత్యధిక ఆదాయ వర్గంలోని 10 శాతం ప్రజల రోజువారీ ఆదాయం లేదా వినియోగ స్థాయి సుమారు 10 డాలర్లుగా ఉంది. అమెరికాలో ఇదే స్థాయి 173 డాలర్లు కాగా, కెనడా, ఆస్ట్రేలియాల్లో 129 డాలర్లు, జర్మనీలో 128 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన భారత్‌లోని అత్యధిక ఆదాయ వర్గంతో పోలిస్తే అమెరికాలోని సంపన్నుల స్థాయి 17 రెట్లకుపైగా ఉంది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీల్లోనూ ఈ వ్యత్యాసం 12 రెట్లకుపైగా ఉంది.
నెలకు రూ.80 వేల జీతం వస్తే టాప్ 10 శాతంలోకి!
భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ పంపిణీ ఎంత అసమానంగా ఉందో అర్థం చేసుకోవడానికి నెలవారీ సంపాదనను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించిన అంచనాల ప్రకారం, నెలకు రూ.80,000 సంపాదించే వ్యక్తి దేశంలోని అత్యధిక ఆదాయం పొందే 10 శాతం వర్గంలోకి వస్తారు. అయితే ఈ స్థాయి జీతం పొందేవారు కూడా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని అధిక ఆదాయ వర్గాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ ఆదాయాన్ని పొందుతున్నట్లు అంతర్జాతీయ పోలికలు తెలియజేస్తున్నాయి.
పేదరికం తగ్గుతున్నా.. అంతరాలపై ఆందోళన
భారత్‌లో పేదరికం తగ్గుతున్న సంకేతాలు కూడా ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు 2025 అక్టోబర్ పేదరిక నివేదిక ప్రకారం, రోజుకు 3 డాలర్ల అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన జీవించే జనాభా వాటా 2011–12లో 27.1 శాతంగా ఉండగా, 2022–23 నాటికి 5.3 శాతానికి తగ్గింది. రోజుకు 4.20 డాలర్ల ప్రమాణం ప్రకారం పేదరికం కూడా ఇదే కాలంలో 57.7 శాతం నుంచి 23.9 శాతానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
అయితే పేదరికం తగ్గడం, ఆదాయ అసమానతలు పూర్తిగా తొలగిపోవడం రెండూ ఒకటి కావు. దేశంలో ఆర్థిక వృద్ధి ఫలాలు వివిధ ఆదాయ వర్గాలకు ఏ మేరకు చేరుతున్నాయన్నది కీలకం. మెరుగైన వేతనాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, స్థిరమైన ఉపాధి అవకాశాలు విస్తరించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాల్లో విస్తృతమైన మార్పు సాధ్యమవుతుంది.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ సంపాదనలో ఇదో కొత్త ఐడియా!


