రియల్‌ ఎస్టేట్‌ సంపాదనలో ఇదో కొత్త ఐడియా! | Real estate investment Chinese Woman Buys Parking Spaces earns Double | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ సంపాదనలో ఇదో కొత్త ఐడియా!

Oct 11 2026 1:52 PM | Updated on Oct 11 2026 1:57 PM

Real estate investment Chinese Woman Buys Parking Spaces earns Double

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయని చాలా మందికి తెలుసు. పెట్టిన ప్రతి రూపాయికి ఎంతో కొంత లాభమైతే ఉంటుంది. అందుకే చాలా మంది ఇళ్లు, స్థలాలు కొనేస్తుంటారు. కానీ కాస్త భిన్నంగా ఆలోచించడం, భవిష్యత్తును అంచనా వేయడం తెలివైన సంపాదనకు మార్గం. ఇలా ఆలోచించే రియల్‌ ఎస్టేట్‌లో సంపాదించాలంటే భారీగా ఇళ్లు, స్థలాలపై మాత్రమే పెట్టుబడి పెట్టాల్సిన పని లేదని నిరూపించారు ఓ మహిళ.

చైనాలో ఓ మహిళ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై తన అంచనాలతో ఏకంగా 196 పార్కింగ్‌ స్థలాలను కొనుగోలు చేశారు. అప్పట్లో కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన లేని ఈ స్థలాలపై రూ.14.48 కోట్లకు సమానమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. కాలక్రమేణా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పార్కింగ్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆమె అద్దెలను రెట్టింపు చేయడంతో స్థానిక నివాసితులతో వివాదం మొదలైంది. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరగా, ఆమె కొనుగోలు చట్టబద్ధమైనదేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

196 పార్కింగ్‌ స్థలాల కొనుగోలు

చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చాంగ్షాలో వూ అనే ఇంటిపేరు కలిగిన మహిళ 2018లో ఓ నివాస సముదాయంలో 196 పార్కింగ్‌ స్థలాలను ఒకేసారి కొనుగోలు చేశారు. ఇందుకోసం 1.4 కోట్ల యువాన్లు వెచ్చించారు. అప్పటి సగటు మారకపు విలువ ప్రకారం ఇది సుమారు రూ.14.48 కోట్లు. ఆ ప్రాజెక్టులోని మొత్తం పార్కింగ్‌ స్థలాల్లో దాదాపు 40 శాతం ఆమె సొంతం చేసుకున్నారు.

సౌకర్యాలు లేనిచోట పెట్టుబడి

2018లో ఈ నివాస ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పుడు అక్కడ దుకాణాలు, పాఠశాలలు, మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో ఇళ్లతో పాటు పార్కింగ్‌ స్థలాల కొనుగోలుపైనా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

అయితే, భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వూ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పెట్టుబడి పెట్టారు. మరోవైపు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డెవలపర్‌కు ఒకేసారి పెద్ద సంఖ్యలో స్థలాలను కొనుగోలు చేసేందుకు వూ ముందుకు రావడం ఊరటనిచ్చింది. ఆమె అంచనాలకు తగ్గట్టుగానే కాలక్రమేణా పరిసర ప్రాంతం అభివృద్ధి చెందింది. నివాస సముదాయంలోకి ఎక్కువ మంది కుటుంబాలు రావడంతో పార్కింగ్‌ స్థలాలకు డిమాండ్‌ పెరిగింది.

రెట్టింపు అద్దె..

డిమాండ్‌ పెరగడంతో వూ తన పార్కింగ్‌ స్థలాల్లో కొన్నింటిని నెలకు 500 యువాన్ల చొప్పున అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.7,200. 2018లో డెవలపర్‌ నిర్ణయించిన అసలు నెలవారీ అద్దెతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

అద్దెను నెలకు 300 యువాన్లకు (సుమారు రూ.4,300) తగ్గించాలని కొందరు నివాసితులు కోరినా ఆమె అంగీకరించలేదు. అంతేకాదు, కొన్ని పార్కింగ్‌ స్థలాలను ఒక్కొక్కటి లక్ష యువాన్ల (సుమారు రూ.14.5 లక్షలు) ధరకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని స్థలాలకు వాటి అసలు విలువతో పోలిస్తే 80 శాతం వరకు అధిక ధరలు నిర్ణయించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇతరులు తన స్థలాలను అనధికారికంగా వినియోగించకుండా పార్కింగ్‌ లాక్‌లను కూడా ఏర్పాటు చేశారు.

కోర్టులోనూ అనుకూల తీర్పు 

పార్కింగ్‌ స్థలాలు రోజువారీ అవసరాలకు కీలకమైనవని, ఒకే వ్యక్తి పెద్ద సంఖ్యలో వాటిని కొనుగోలు చేసి అధిక ధరలకు అద్దెకు ఇవ్వడం వల్ల మిగతా నివాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వూ, డెవలపర్‌ మధ్య కుదిరిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కానీ వూకు అనుకూలంగానే కోర్టు తీర్పు వచ్చింది.

ఇదీ చదవండి: జీఎస్టీ కొత్త రూల్స్‌.. రియల్‌ ఎస్టేట్‌కు రిలీఫ్‌ ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement