మల్టీప్లెక్సుల బిజినెస్‌ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్‌- భరోసా ఇచ్చిన పుష్ప

Indian Multiplexes Sharp Recovery After Spiderman NWH Pushpa Business - Sakshi

ఫ్రెండ్లీ నైబర్‌హుడ్‌.. స్పైడర్‌మ్యాన్‌కు ఉన్న ట్యాగ్‌ లైన్‌ ఇదే.  తన, పర బేధం లేకుండా ఆపదలో ఎవరైనా ఉన్నారని గ్రహిస్తే.. ఆలస్యం చేయకుండా వాలిపోయి రక్షిస్తుంటాడు. అలాంటి సూపర్‌ హీరో(ముగ్గురు) ఇప్పుడు ఇండియన్‌ మల్టీప్లెక్స్‌ బాక్సాఫీస్‌ను కాపాడేశాడు. కరోనా టైం నుంచి పాతాళానికి పడిపోతున్న టికెట్‌ సేల్‌ను తన సాలెగూడుతో  అమాంతం ఆకాశానికి చేర్చేశాడు.  భవిష్యత్తు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌కు భరోసా ఇస్తూ.. భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు రిలీజ్‌ అయ్యే ధైర్యం 2021 ఇయర్‌ ఎండ్‌లో అందించి బాక్సాఫీస్‌కు జోష్‌ నింపాడు.

ఓ హాలీవుడ్‌ మూవీ, మరో టాలీవుడ్‌ మూవీ మల్టీప్లెక్సు థియేటర్లకు ఊపు తెచ్చాయి. కరోనా సంక్షోభం తర్వాత మిణుకుమిణుకుమంటున్న మల్టీప్లెక్సు వ్యాపారానికి ‘సినిమా’ ఉందనే నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చాయి. రిలీజ్‌కి ముందే వంద శాతం టిక్కెట్ల బుకింగ్‌ సాధించి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాయి. విశేషం ఏంటంటే.. బుకింగ్‌ దెబ్బకి సైట్లు సైతం క్రాష్‌ అయ్యే పరిస్థితి ఎదురైందంటే ఆ క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.


సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సుల భవితవ్యంపై సందేహాలు కమ్ముకుంటున్న వేళ వాటిని ఒక్క దెబ్బతో పటాపంచాలు చేశాయి ఈ రెండు సినిమాలు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుకు ఊపిరి పోసిన సినిమాలుగా స్పైడర్‌మ్యాన్‌, పుష్పలను పేర్కొనవచ్చు. హాలీవుడ్‌ మూవీ ఐనప్పటికీ స్థానికంగా స్పైడన్‌ మ్యాన్‌ మూవీకి మల్టీప్లెక్స్‌లలో మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలో రిలీజ్‌కి ఒక రోజు ముందే వంద శాతం టిక్కెట్లు అమ్ముడై సంచలనం సృష్టించింది. అంతకు ముందు అఖండ సినిమా ఇటు సింగిల్‌ స్క్రీన్‌ల స్థాయిలో మల్టీప్లెక్స్‌లలో కూడా హవా కనబరిచింది.

ఆదాయం ఇక్కడి నుంచే
సాధారణంగా మల్టీప్లెక్స్‌లకు ఆదాయం మూడు రకాలుగా అందుతుంది. టిక్కెట్ల అమ్మకం (యావరేజ్‌ టిక్కెట్‌ ప్రైజ్‌, ఏటీపీ), సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చిన వారు పెట్టే  తలసరి ఖర్చు (స్పెండ్‌ పర్‌ హెడ్‌, ఎస్‌పీహెచ్‌), యాడ్‌ రెవిన్యూ. కరోనా కారణంగా పెట్టిన ఆంక్షలతో గత ఏడాదిన్నరగా థియేటర్లకు ఈ మూడు రకాలుగా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని సందర్భాల్లో సున్నాకు చేరుకుంది.

 

సూర్యవంశీ ఇచ్చిన ధైర్యం
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత సెప్టెంబరులో థియేటర్లు ప్రారంభమయ్యాయి. అయితే జనాలు మల్టీప్లెక్స్‌లకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ నెలలో సినిమాలు విడుదలైనప్పుడు తక్కువ ఆక్యుపెన్షీ నమోదు అయ్యింది. అక్టోబరులో కొద్దిగా మెరుగుపడి అది 18 శాతానికి చేరుకుంది. నవంబరులో సూర్యవంశీ సినిమా రాకతో 27 శాతంగా నమోదు అయ్యింది.  ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో దానిపై ఆధారపడిన స్పెండ్‌ పర్‌ హెడ్‌ ఆదాయం కూడా పడిపోయింది. పైగా ముంబై లాంటి రాష్ట్రాల్లో థియేటర్లలో ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌కి అనుమతి ఇవ్వలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ తర్వాత మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎంతో ఖర్చుతో నిర్మించిన మల్టీప్లెక్సులు కథ కూడా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల మాదిరిగానే అవుతుందా అనే కామెంట్లు వినిపించాయి.

83, ట్రిపుల్‌ ఆర్‌...
స్పైడర్‌మ్యాన్‌, పుష్ప సినిమాలు ఇచ్చిన ఊపుతో గ్రాండ్‌ రిలీజ్‌కి రెడీ అయ్యాయి మిగిలిన సినిమాలు. పుష్ప సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైనా నాన్‌ ఇండియన్‌ మూవీ స్పైడర్‌ మ్యాన్‌ నిలదొక్కుకుంది. వారంతానికి వంద కోట్ల రూపాయల క్లబ్‌లో ఈ సినిమా చేరింది. మరోవైపు టాక్‌ తో సంబంధం లేకుండా రిలీజ్‌డే నుంచి సండే వరకు మల్టీప్లెక్సుల్లో టిక్కెట్లన్నీ బుక్‌ అవడం పుష్పకి అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా మల్టీప్లెక్సుల గల్లాపెట్టే గలగలమంటోంది. ఇందులో ముందుగా వస్తో‍న్న సినిమా క్రికెట్‌ బేస్డ్‌ మూవీ 83. ఈ సినిమా తర్వాత వరుసగా మ్యాట్రిక్స్‌ రీసర్సెక‌్షన్‌, జెర్సీ, కింగ్స్‌మ్యాన్‌ సినిమాలు డిసెంబరులో ఉండగా జనవరిలో ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు అక్షయ్‌ కుమార్‌ పృ‍ధ్విరాజ్‌ సినిమాలు ఉన్నాయి. 

ఒమిక్రాన్‌ లేకుంటే
ఒమిక్రాన్‌ ముప్పు. థర్డ్‌ వేవ్‌ భయాలను జయిస్తే 2022లో మల్టీప్లెక్సులు పూర్తిగా కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకుంటాయని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఏఐ) అంచనా వేస్తోంది. అందుకే రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలం ఎంతో కీలకమని ఎంఐఏ అంటోంది. 

యాడ్‌ రెవెన్యూ కూడా
పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సు చైన్లు కలిగిన సంస్థలకు యాడ్‌ రెవెన్యూ దాదాపు 10 శాతంగా ఉండేంది. సినిమాలు రిలీజ్‌ కాకపోవడం, మల్టీప్లెక్సులు మూత పడటంతో దాదాపు ఏడాదిన్నరగా ఈ ఆదాయానికి దాదాపు కోత పడింది. డిసెంబరులో వచ్చిన సినిమాలు బాక్సాఫీసుకు ఊపు ఇవ్వడంతో. ప్రస్తుతం ప్రొడక‌్షన్‌లో ఉన్న సినిమాలకు ప్రచారం సైతం ఊపందుకోనుంది. ఫలితంగా యాడ్‌ రెవెన్యూ సైతం సాధారణ స్థితికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని ఎంఏఐ అధ్యక్షుడు కమల్‌ జైన్‌చందానీ జాతీయ మీడియాతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓటీటీ టైం పెంచుతాం
కరోనా రావడానికి ముందు సినిమా రిలీజ్‌ అయిన తర్వాత 8 వారాల అనంతరం ఓటీటీకి ఇవ్వాలనే ఒప్పందం ఉండేది. కానీ కరోనా వచ్చి థియేటర్లు క్లోజ్‌ అయిన తర్వాత చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో వచ్చాయి. థియేటర్‌లో రిలీజరైనా నాలుగు వారాలే రన్‌ టైం ముగిసిన తర్వాత ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నందున త్వరలోనే ఓటీటీ టైంని నాలుగు నుంచి ఎనిమిది వారాలకు పెంచాలని డిమాండ్‌ చేయాలని ఎంఏఐ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను మరికొంత కాలం అంచనా వేసి ఏప్రిల్‌ 1 నుంచి ఎనిమిది వారాల గడువు మళ్లీ వస్తుందంటున్నారు.

-సాక్షి, వెబ్‌ స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top