ఒమిక్రాన్‌ ముప్పు: ఆశలన్నీ బూడిదపాలు.. వారంలో 200 కోట్ల నష్టం!!

Indian Hospitality Sector Fears Amid Omicron Corona Cases Surge - Sakshi

కరోనా దెబ్బకు ఆర్థికంగా దాదాపు ప్రతీ రంగం కుదేలు అయ్యింది. ముఖ్యంగా ప్రయాణాలు, కొవిడ్‌ రూల్స్‌ కారణంగా భారీగా నష్టపోయిన వాటిల్లో ఒకటి హాస్పిటాలిటీ సెక్టార్‌(ఆతిథ్య రంగం). అయితే పూర్వవైభవం సంతరించుకుందని సంబురపడే లోపే.. ఈ రంగంపై మరో పిడుగు పడింది. అది ఒమిక్రాన్‌ రూపంలో. తాజాగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఆతిథ్య రంగాన్ని మంచి సీజన్‌లో చావు దెబ్బ తీస్తున్నాయి. 

కరోనా కారణంగా ఈ రెండేళ్లలో  ఆతిథ్య రంగానికి వాటిల్లిన నష్టం లక్షల కోట్ల రూపాయల్లోనే!.  అందునా వారం రోజుల వ్యవధిలో సుమారు 200రూ. కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ నష్టం కేవలం బుకింగ్‌ క్యాన్సిలేషన్‌ ద్వారా వాటిల్లింది కావడం. యస్‌.. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 31 మధ్య ఆతిథ్య రంగం ఈ మేర నష్టం చవిచూసింది. క్రిస్మస్‌, న్యూఇయర్‌తో పాటు వెడ్డింగ్స్‌, ఇతరత్ర ఈవెంట్స్‌ రద్దు ద్వారానే ఈ నష్టం వాటిల్లిందని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోషియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (FHRAI) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

 

మాంచి సీజన్‌ మీదే.. 
కరోనా సీజన్‌లో బుకింగ్‌లు లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్‌ వెలవెలబోయాయి. నెలలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో కోలుకోలేని దెబ్బ పడింది.  8 శాతం బిజినెస్‌ శాశ్వతంగా మూతపడింది కూడా!.  తద్వారా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ టైంలో భారీ నష్టమే వాటిల్లింది. అయితే రెండు వేవ్‌లు అన్‌-సీజన్‌లో రావడంతో ఆతిథ్య రంగంపై నష్టం మరీ ఘోరంగా అయితే లేదు. కానీ, ఇప్పుడు వేడుకల సమయం. పైగా పెళ్లిళ్ల సీజన్‌. వ్యాక్సినేషన్‌ కూడా నడుస్తుండడంతో వ్యాపారాలు గాడిన పడతాయని అంతా భావించారు. ఇప్పుడేమో ఒమిక్రాన్‌ వల్ల పరిస్థితి ఊహించిన విధంగా లేదు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లింది.. మునుముందు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న దానిపై లెక్కలు కట్టే పనిలో ఉంది ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోషియేషన్స్‌.  అందుకే నష్టస్థాయి ఊహించినదానికంటే ఘోరంగా ఉండొచ్చనే ఆందోళనలో ఆతిథ్య రంగం ఉందని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ సెక్రటరీ ప్రదీప్‌ శెట్టి చెబుతున్నారు. 

ఒమిక్రాన్‌ వల్లే.. 
అక్టోబర్‌ 2021 నుంచి హోటల్స్‌, రెస్టారెంట్ల బుకింగ్‌లు పెరుగుతూ వస్తుండడంతో హాస్పిటాలిటీ రంగానికి మంచి రోజులు వచ్చినట్లు భావించారంతా. డిసెంబర్‌ రెండో వారం నాటికి ఈ బుకింగ్‌లు ఏకంగా 80-90 శాతానికి చేరాయి( కార్పొరేట్‌ హోటల్స్‌లో అయితే అది 50 శాతం మార్క్‌ దాటింది).  కానీ, కొత్త వేరియెంట్‌ ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్‌ 25 నుంచి హోటల్స్‌ ఆక్యుపెన్సీ, రేట్లు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. ఆంక్షలు-కర్ఫ్యూలు, ఆక్యుపెన్సీ నిబంధనలు,  కస్టమర్ల భయాందోళనల నడుమ అప్పటికే అయిన బుకింగ్స్‌ దాదాపు 60 శాతం మేర రద్దయ్యాయి.  కరోనా తొలినాళ్లలోలాగా ఇప్పుడు మళ్లీ పది నుంచి 15 శాతం ఆక్యుపెన్సీతో హోటల్స్‌ బిజినెస్‌ నడుస్తోంది. మునుముందు కఠిన ఆంక్షలు విధిస్తే.. ఈ కాస్త ఆక్యుపెన్సీ కూడా ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది. 

ప్రభుత్వ సాయం!
ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో అనే ఆందోళన ఆతిథ్య రంగంలో నెలకొంది. మరోవైపు రెస్టారెంట్‌లలోకి అడుగుపెట్టేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, డిసెంబర్‌లో 50 శాతం ఉన్న అమ్మకాలు, ఆదాయాలు.. ఇప్పుడు కేవలం 10-20 శాతానికి పడిపోయాయని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ అంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మద్దతు కోరుకుంటోంది ఆతిథ్య రంగం. భౌతిక దూరం ఇతరత్ర కొవిడ్‌ రూల్స్‌ పాటిస్తామని, ప్రతిగా తమకు ఊరట-మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ. అదే విధంగా  ఉద్యోగుల జీతభత్యాల భారంగా మారుతున్న తరుణంలో.. పన్నులు తగ్గింపులాంటి మినహాయింపులు ఆశిస్తోంది కూడా.

సంబంధిత వార్త: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండవచ్చంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top