
అమెరికన్ కంపెనీలతో ఎగమతిదారుల చర్చలు
న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ చెప్పారు. అమెరికాలోని లెదర్ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్‌లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు.
కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్‌ఐఈవో వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ కపూర్ తెలిపారు. కార్పెట్లు, హోమ్ ఫరి్న షింగ్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు.
బియ్యంపై ప్రభావం తాత్కాలికమే..
దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్‌ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గర్గ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు.
మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.
టారిఫ్‌ల ఎఫెక్ట్ స్వల్పమే
నితి ఆయోగ్ సభ్యులు విర్మాణీ
న్యూఢిల్లీ: యూఎస్ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్ సభ్యులు అరవింద్ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్ భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు.