కష్ట కాలంలోనూ భారత్‌ ఎకానమీ దూకుడు

Indian economy likely to navigate rough global weather in 2023 - Sakshi

అసోచామ్‌ నివేదిక

కార్పొరేట్‌ పనితీరు బాగుంది

ద్రవ్యోల్బణం నెమ్మది

డిమాండ్‌ పరిస్థితులు బెటర్‌

న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్‌ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్‌ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్,  మెరుగైన కార్పొరేట్‌ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది.  అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► గ్లోబల్‌ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్‌ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం.  
► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది.  
► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు,  ఆటోమొబైల్స్‌ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్‌ కనిపిస్తోంది.  
► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్‌ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది.  
► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవలే అంచనా వేసింది.  అధిక వడ్డీ ప్రభావం భారత్‌ కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది.  అయితే ఆయా ప్రతికూలతలను భారత్‌ కార్పొరేట్‌ రంగం అధిగమిస్తోంది.  
► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top