
గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్‌లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.
ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..
బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది.