
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతదేశం స్టార్‌లింక్ సేవలను ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇతర సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేయడానికి సన్నద్ధమవుతాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నెలకు 10 డాలర్లు లేదా రూ.840 కంటే తక్కువ ధరలోనే అపరిమిత డేటా అందించాలని యోచిస్తున్నాయి.
తొలి దశలో కంపెనీలన్నీ యూజర్లను పెంచుకోవడంపై ద్రుష్టి సారించనున్నాయి. సుమారు 10 మిలియన్స్ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రమ్ కాస్ట్‌ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని సంస్థలు భావిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు నెలకు రూ. 500 ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ధర సాధారణ సర్వీసులతో పోలిస్తే చాలా ఎక్కువ.
ట్రాయ్ సిఫార్సులలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతం లెవీ, MHz స్పెక్ట్రానికి సంవత్సరానికి రూ.3500 ఫీజు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా శాటిలైట్ ఉపగ్రహ కమ్యూనికేషన్ ప్రొవైడర్లు వాణిజ్య సేవలను అందించడానికి 8 శాతం లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను అమలు చేయడానికి ముందు.. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.
లైసెన్స్ ఫీజులు.. స్పెక్ట్రమ్ ఛార్జీలు ఉన్నప్పటికీ యూజర్లను పెంచుకునేందుకు తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించడానికి టెలికాం విభాగం నుంచి అనుమతులు లభించాయి. అయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఆమోదం లభించాల్సి ఉంది.
ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
స్టార్‌లింక్ మాత్రమే కాకుండా.. యూటెల్సాట్ వన్‌వెబ్ (Eutelsat OneWeb), జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ (Jio Satellite Communications) కూడా వరుసగా 2021, 2022లో టెలికాం విభాగం నుంచి అనుమతులు పొందాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఈ ఆమోదం లభించిన తరువాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.