వరంగల్‌ వాసి అనిల్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు | Sakshi
Sakshi News home page

వరంగల్‌ వాసి అనిల్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు

Published Mon, Mar 18 2024 2:53 PM

Indian American Named Small Business Person Of The Year 2024 - Sakshi

2024 స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అనిల్‌  బోయినపల్లి

తెలంగాణకు చెందిన వరంగల్‌వాసికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. యూఎస్‌లోని వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్‌ ఇండియన్‌ అమెరికన్‌ విభాగంలో 2024 స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. యూఎస్‌ స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎస్‌బీఏ) నేషనల్‌ స్మాల్‌ బిజినెస్‌ వీక్‌ (ఎన్‌ఎస్‌బీడబ్ల్యూ) అవార్డు-2024 గ్రహీతలను ఇటీవల ప్రకటించింది. 

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పాటుపడిన ప్రముఖ వ్యాపారవేత్తలకు ఈ స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఇస్తారు. ఇందులో భాగంగా ‘స్కై సొల్యూషన్స్‌’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న అనిల్‌ వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్‌ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్‌ సంస్థను ఆయన ఏర్పాటుచేశారు. ఇది వ్యాపార సంబంధమైన అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది.

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అనిల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనిల్‌ కొంతకాలం సీఎన్‌ఎస్‌ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా హెల్త్‌కేర్‌ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విధులు నిర్వర్తించారు. ఫెన్నీ మే, హారిస్‌ కార్పొరేషన్‌లో కూడా ఆయన పనిచేశారు. 

ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్‌ఎస్‌బీడబ్ల్యూ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలోని వాల్డోర్స్‌ ఆస్టోరియా హోటల్‌లో జరగనుంది. ఎస్‌బీఏ అడ్మినిస్ట్రేటర్‌, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ క్యాబినెట్‌లో సభ్యుడైన ఇసాబెల్‌ కాసిల్లాస్‌ గుల్మాన్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను అందించనున్నారు. తనకు దక్కిన ఈ అవార్డుకు సంబంధించి అనిల్‌ స్పందిస్తూ భారత్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా వంటి దేశంలో ఇలాంటి ఘనత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈక్యామ్స్‌, ఈ-ఎంఐపీపీ, ఈ-ఎఫ్‌ఆర్‌ఎం, బ్లూబటన్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులకు అనిల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement