కేంద్ర ప్రభుత్వం తాజాగా వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. నిర్దిష్ట సంస్థలు ఇకపై ఏ రూపంలోనైనా వెండిని దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్‌టీ) నుంచి అధీకృత అనుమతులను పొందవలసి ఉంటుంది. బ్యాంకులుసహా ఆర్‌బీఐ నియమిత ఏజెన్సీలు, డీజీఎఫ్‌టీ అనుమతించిన సంస్థలతోపాటు.. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ ద్వారా అర్హతగల ఐఎఫ్‌ఎస్‌సీఏ నిర్ధారిత ఆభరణ విక్రేతలు.. వెండిని దిగుమతి చేసుకోవాలంటే డీజీఎఫ్‌టీ అధీకృత అనుమతులు తప్పనిసరి.
వెరసి ఇప్పటికే పసిడి, వెండి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని గత నెలలో 15 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వెండి దిగుమతులపై కఠిన నిబంధనలకు తెరతీసినట్లయింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావం పడుతున్న కారణంగా ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. వార్షికంగా ఏప్రిల్ నెలలో వెండి దిగుమతులు 157 శాతం జంప్‌చేసి 41.1 కోట్ల డాలర్లను తాకగా.. గతేడాది(2025–26)లో సైతం 150 శాతం ఎగసి 1,200 కోట్ల డాలర్లకు చేరాయి. భారత్ ప్రధానంగా యూఏఈ, యూకే, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటోంది. అటు ఆభరణాల తయారీ, ఇటు పారిశ్రామిక వినియోగానికి వెండిని వినియోగించే విషయం విదితమే.
ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!


