
ఆర్‌బీఐ బులెటిన్
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థల్లో సర్దుబాట్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి వైవిధ్యమైన వనరులు, ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తి తదితర అంశాలతో భారత్‌కు ప్రయోజనాలు చేకూరగలవని ఏప్రిల్ బులెటిన్‌లో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సరీ్వసుల ఎగుమతులు నిలకడగా నమోదవుతుండటం, రెమిటెన్సులు మెరుగ్గా ఉండటం.. కరెంటు అకౌంటుకు కాస్త బాసటగా నిలుస్తున్నాయని వివరించింది. పాలసీపరమైన మద్దతు ఉంటే అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులను భారత్ తనకు అవకాశంగా మల్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది.
వాణిజ్యం, టారిఫ్‌లపరమైన ఉద్రిక్తతలు పెరగడం, ఫలితంగా ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తడం వల్ల సమీప భవిష్యత్తులో ప్రపంచ వృద్ధి బలహీనపడుతుందేమోనన్న ఆందోళన నెలకొందని ఆర్‌బీఐ వివరించింది. ఇతర దేశాల్లో డిమాండ్ బలహీనపడటం వల్ల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడినా.. దేశీయంగా వృద్ధి చోదకాలుగా ఉంటున్న వినియోగం, పెట్టుబడులపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది. 2025లో వర్షపాతం సాధారణంగా కన్నా మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో వ్యవసాయ రంగం ఆశావహంగా కనిపిస్తోందని, దీనితో రైతుల ఆదాయాలు పెరిగి, ఆహార ధరలు అదుపులో ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ వివరించింది.
’బ్యాంక్‌డాట్‌ఇన్’ డొమైన్‌కు మార్పు ..
బ్యాంకులు ప్రస్తుతం తాము ఉపయోగిస్తున్న డొమైన్ నుంచి ’బ్యాంక్‌డాట్‌ఇన్’ డొమైన్‌కి మారే ప్రక్రియను ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి దీన్ని పూర్తి చేయాలని పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ బ్యాంకులన్నింటికీ ఈ ప్రత్యేక డొమైన్‌నే వినియోగంలోకి తేవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.