400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ | India merchandise export set to cross 400 billion Dollers in current fiscal | Sakshi
Sakshi News home page

400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ

Published Sat, Mar 19 2022 4:02 AM | Last Updated on Sat, Mar 19 2022 4:02 AM

India merchandise export set to cross 400 billion Dollers in current fiscal - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్‌–2022 మార్చి) 400 బిలియన్‌ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్‌ ఎగుమతుల విలువ 390 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్‌ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు.

ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు.  అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్‌అండ్‌డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.  

జీఐ ట్యాగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి...
కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) ట్యాగ్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్‌ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది.  

జీఐ ఉత్పత్తులంటే...
జీఐ ట్యాగ్‌ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్‌ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్‌ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్‌ సపోటా, జల్గావ్‌ అరటి, వజ కులం పైనాపిల్,  మరయూర్‌ బెల్లం, డార్జిలింగ్‌ టీ, బాస్మ తీ రైస్‌. మహాబలేశ్వర్‌ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్‌ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు.

2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్‌ నుండి బ్రిటన్‌కు  నాగా మిర్చా (కింగ్‌ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్‌ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు  నిమ్మకాయల ఎగుమతులు  జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్‌ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement