
సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. భారత్ మీద ఆ ప్రభావాన్ని కొంత తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించి.. వాణిజ్య సంబంధాలను పెంచుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి.
ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ ప్రీమియం బైకులోను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరుతాయి.
బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరి కొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చలు మోటార్ సైకిళ్ళు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాలేదు. ఎందుకంటే ఇందులో ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు.
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఔషధ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే భారతదేశం అమెరికాకు తన ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది.