అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్‌లో తగ్గని ఈవీ సేల్స్ | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్‌లో తగ్గని ఈవీ సేల్స్

Published Sat, May 25 2024 8:24 PM

India Leads in Electric Vehicle Sales Amid Global Slowdown Here is The Details

ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.

వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.

యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్‌లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్‌లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.

భారతదేశంలో ఏం జరుగుతోంది?
జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement