
ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4 శాతం
న్యూఢిల్లీ: ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4 శాతం వృద్ధి నమోదు చేసింది. మైనింగ్ రంగం 6 శాతం మెరుగుపడటం ఇందుకు తోడ్పడిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. గతేడాది ఆగస్టులో ఐఐపీ వృద్ధి దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉండగా, మైనింగ్ రంగం 4.3 శాతం క్షీణత నమోదు చేసింది. తాజాగా సూచీలో నాలుగింట మూడొంతుల వాటా ఉండే తయారీ రంగం వృద్ధి 1.2 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగింది.
విద్యుదుత్పత్తి 3.7 శాతం క్షీణత నుంచి బైటపడి 4.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, జూలై ఐఐపీ వృద్ధి గణాంకాలను ముందుగా అంచనా వేసిన 3.5 శాతం నుంచి 4.3 శాతానికి ఎన్‌ఎస్‌వో సవరించింది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 4.3 శాతం నుంచి 2.8 శాతానికి నెమ్మదించింది. రాబోయే రోజులలో జీఎస్‌టీ క్రమబద్ధీకరణతో పండుగ సీజన్‌లో వినియోగం పుంజుకుంటుందని, నిల్వలన్నీ అమ్ముడైపోతే, సెపె్టంబర్–అక్టోబర్‌లో తయారీ రంగ ఉత్పత్తి మెరుగుపడటానికి దోహదపడగలదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.