యుద్ధంతో భారత్‌ జీడీపీకి 0.50 శాతం నష్టం,నిరుద్యోగంతో పాటు

India Gdp 50 Basis Points Lost Due To Ukraine And Russia Crisis - Sakshi

అమెరికన్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) నష్టం ఉంటుందని అంచనావేసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.9 శాతానికి తగ్గిస్తున్నట్లు (8.4 శాతం నుంచి) పేర్కొంది. 

చమురు ధరల తీవ్రత దేశంలో సవాళ్లకు దారితీస్తుందని పేర్కొంది. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిలోనే 6 శాతంగా కొనసాగుతుందని విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే స్టాగ్‌ఫ్లేషన్‌ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశానికి అంతర్జాతీయంగా సవాళ్లను తెచ్చిపెడతాయని, ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్టంభన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయని విశ్లేషించింది. రికవరీ కొనసాగినా అది బలహీనంగా ఉంటుందని పేర్కొంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు పదేళ్ల గరిష్టం 3 శాతానికి (జీడీపీలో) పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. 

దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరమే సరళతర ఆర్థిక విధానానికి ముగింపు పలకవచ్చని, ఏప్రిల్‌ లేదా జూన్‌ విధాన సమీక్షలో ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (వరుసగా 10 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా 4 శాతంగా కొనసాగుతోంది) పావుశాతం వరకూ పెంచే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో సరళతర ఆర్థిక విధానాలు మరెంతోకాలం కొనసాగించే పరిస్థితి లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా బడ్జెట్‌ అంచనావేయగా ఇది 6.9 శాతం వరకూ పెరగవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనావేసింది.

చదవండి: Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top