ఈవీ హవా | India domestic automobile sector new all-time retail record in May 2026 | Sakshi
Sakshi News home page

ఈవీ హవా

Jun 9 2026 1:18 AM | Updated on Jun 9 2026 1:18 AM

India domestic automobile sector new all-time retail record in May 2026

ఆటో అమ్మకాల్లో కొత్త రికార్డు 

తొలిసారిగా 11 శాతం దాటిన ఈవీ వాటా 

మేలో మొత్తం 25.31 లక్షల వాహనాల విక్రయాలు 

ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాలు  

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ రంగం మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంధన పొదుపు, పర్యావరణహిత వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో వాహనాల రిటైల్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 9.55 శాతం పెరిగి 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మేలో ఈ సంఖ్య 23,10,451 యూనిట్లుగా ఉంది. 

అలాగే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా తొలిసారిగా 11 శాతం మార్కును దాటిందని ఆటో డీలర్ల సమాఖ్య ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) సోమవారం వెల్లడించింది. వాణిజ్య వాహనాలు (సీవీ), ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), అలాగే మొత్తం ఈవీ విభాగంలో మే నెలకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ విక్రయాలు ఇవే. 

ఈవీలకు పెరిగిన ఆదరణ
మే నెలలో ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో వినియోగదారులు ఇంధన పొదుపు కలిగిన, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపినట్లు ఫాడా తెలిపింది. దీనివల్ల ద్విచక్ర వాహనాల విభాగంలో ఈవీల వాటా గత ఏడాది 6.11% నుంచి 9.25 శాతానికి పెరిగింది. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా తొలిసారిగా 11% దాటడం విశేషం. అయితే పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా షోరూమ్‌లకు వచ్చే వినియోగదారుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు వివాహాల సీజన్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు ప్రవాహం, జీఎస్టీ 2.0 కింద అందుబాటులో ఉన్న ప్రయోజనాలు విక్రయాలకు మద్దతుగా నిలిచినట్లు డీలర్లు పేర్కొన్నారు. 

సవాళ్ల మధ్య వృద్ధి
‘‘తీవ్ర ఎండలు, ఇంధన ధరల ఒత్తిడి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు మే నెలలో ప్రభావం చూపాయి. అయినప్పటికీ భారత ఆటో రిటైల్‌ రంగం వృద్ధి బాటలోనే కొనసాగింది. త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్లు, మొత్తం రిజి్రస్టేషన్ల పరంగా మే నెల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్‌. విఘ్నేశ్వర్‌ తెలిపారు. అలాగే ఏప్రిల్‌తో పోలిస్తే మేలో విక్రయాలు 6.75 శాతం తగ్గినా, ఇది సాధారణ సీజనల్‌ ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ఆలస్యానికి సంబంధించినదేనని ఆయన పేర్కొన్నారు.

జూన్‌పై ఆశాభావం
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఖరీఫ్‌ సాగు పనుల ప్రారంభం, వివాహాల సీజన్‌ కొనసాగడం వాహనాల డిమాండ్‌కు మద్దతు ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించడం కూడా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యానికి అనుకూలంగా మారనుంది. జూన్‌–జూలై–ఆగస్టు కాలానికి సంబంధించి ఆటోమొబైల్‌ రంగం అప్రమత్తతతో కూడిన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల కొనసాగింపు, గ్రామీణ డిమాండ్‌ పెరుగుదల నేపథ్యంలో రెండో త్రైమాసికంలో పరిశ్రమ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఫాడా అంచనా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement