breaking news
Eco-friendly policy
-
ఈవీ హవా
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ రంగం మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంధన పొదుపు, పర్యావరణహిత వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో వాహనాల రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 9.55 శాతం పెరిగి 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మేలో ఈ సంఖ్య 23,10,451 యూనిట్లుగా ఉంది. అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా తొలిసారిగా 11 శాతం మార్కును దాటిందని ఆటో డీలర్ల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం వెల్లడించింది. వాణిజ్య వాహనాలు (సీవీ), ప్యాసింజర్ వాహనాలు (పీవీ), అలాగే మొత్తం ఈవీ విభాగంలో మే నెలకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ విక్రయాలు ఇవే. ఈవీలకు పెరిగిన ఆదరణమే నెలలో ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో వినియోగదారులు ఇంధన పొదుపు కలిగిన, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపినట్లు ఫాడా తెలిపింది. దీనివల్ల ద్విచక్ర వాహనాల విభాగంలో ఈవీల వాటా గత ఏడాది 6.11% నుంచి 9.25 శాతానికి పెరిగింది. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా తొలిసారిగా 11% దాటడం విశేషం. అయితే పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా షోరూమ్‌లకు వచ్చే వినియోగదారుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు వివాహాల సీజన్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు ప్రవాహం, జీఎస్టీ 2.0 కింద అందుబాటులో ఉన్న ప్రయోజనాలు విక్రయాలకు మద్దతుగా నిలిచినట్లు డీలర్లు పేర్కొన్నారు. సవాళ్ల మధ్య వృద్ధి‘‘తీవ్ర ఎండలు, ఇంధన ధరల ఒత్తిడి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు మే నెలలో ప్రభావం చూపాయి. అయినప్పటికీ భారత ఆటో రిటైల్ రంగం వృద్ధి బాటలోనే కొనసాగింది. త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్లు, మొత్తం రిజి్రస్టేషన్ల పరంగా మే నెల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్. విఘ్నేశ్వర్ తెలిపారు. అలాగే ఏప్రిల్‌తో పోలిస్తే మేలో విక్రయాలు 6.75 శాతం తగ్గినా, ఇది సాధారణ సీజనల్ ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ఆలస్యానికి సంబంధించినదేనని ఆయన పేర్కొన్నారు.జూన్‌పై ఆశాభావంనైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఖరీఫ్ సాగు పనుల ప్రారంభం, వివాహాల సీజన్ కొనసాగడం వాహనాల డిమాండ్‌కు మద్దతు ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించడం కూడా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యానికి అనుకూలంగా మారనుంది. జూన్–జూలై–ఆగస్టు కాలానికి సంబంధించి ఆటోమొబైల్ రంగం అప్రమత్తతతో కూడిన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల కొనసాగింపు, గ్రామీణ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రెండో త్రైమాసికంలో పరిశ్రమ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఫాడా అంచనా వేసింది. -
ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్!
పెళ్లి వేడుకలు అనగానే...ఎంత ఖర్చు చేస్తే అంత గొప్ప అనే భావన చాలామందిలో ఉంది. అయితే కొందరు అందుకు భిన్నంగా ఉంటారు. చెన్నైకి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కమ్యూనిటీ బ్లాగర్ ఉమా రామ్ రెండో కోవకు చెందిన మహిళ. తన వివాహాన్ని ఎకో–ఫ్రెండ్లీ వెడ్డింగ్‌గా జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శుభలేఖల నుంచి పెళ్లి వేడుకల ముగింపు వరకు ప్రతి దశలోనూ పర్యావరణ దృష్టితో అడుగులు వేసింది.వివాహ వేడుకలో వ్యర్థాలను తగ్గించడానికి స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ టు భూమి’ సహాయం తీసుకొన్నారు. డైనింగ్ నుంచి డెకార్ వరకు వృథాను వెట్, డ్రై వేస్ట్‌గా వేరు చేశారు. వివాహ వేడుకల్లో ఉపయోగించిన పువ్వులు, పండ్లు, ఇతర కంపోస్టు చేయగల వ్యర్థాలను న్యూట్రీయెంట్–రిచ్ మాన్యూర్గా మార్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికలను సీడ్ పేపర్ నుంచి తయారుచేశారు. ‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అంటారు. ఈ మంచి సూత్రాన్ని వివాహ వేడుకలలో కూడా అనుసరిస్తే... పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు -
ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి
గణపతి విగ్రహాలపై కలెక్టర్, సీపీ సమీక్ష పోలీసులు సూచించిన ఘాట్ల్లోనే నిమజ్జనం చేయాలని వినతి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం భవానీపురం : ఎకో ఫ్రెండ్లీ విధానంలో గణపతి విగ్రహాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన జరుగనున్న వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, అగ్నిమాపక, రవాణా తదితర శాఖలతో సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ వేడుకలను పూర్తి శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జనం సమయంలో జిల్లా యంత్రాంగం సూచించిన ఘాట్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పారు. భవానీఘాట్ను విగ్రహాల నిమజ్జనం కోసం గుర్తించామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటు స్థలాల విషయమై ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకల కోసం ఇప్పటివరకు వెయ్యి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించేందుకు మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్, అగ్రిమాపక శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గతంలో భవానీఘాట్‌లో విగ్రహాల నిమజ్జనం చేపట్టామని, తాగునీటి జలాలు కలుషితం కాకుండా అనువైన ప్రదేశాన్ని నిర్ణయించడానికి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేశామని చెప్పారు. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ అశోక్‌కుమార్, జేసీ-2 ఒంగోలు శేషయ్య, ఇన్చార్జ్ డీఆర్వో డి. సాయిబాబా, ఫైర్ ఆఫీసర్ డి. నిరంజన్‌రెడ్డి, పోలీస్ అధికారులు దామోదర్‌రెడ్డి, రమేష్‌బాబు, డి. శ్రావణ్‌కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ సి. రామకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్ఈ శేషుబాబు, అర్బన్ తహసీల్దార్ ఆర్. శివరామ్ తదితరులు పాల్గొన్నారు.


