
న్యూఢిల్లీ: 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌కి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ ఆరు దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. దేశీయంగా 111 రీసెర్చ్ ప్రాజెక్టులకు రూ. 300 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. 6జీ సేవలు 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఉంటాయన్నారు.
టెక్నాలజీలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో పలు దశాబ్దాల పాటు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనితో కొత్త పరిశ్రమలు వస్తాయని, ప్రస్తుతమున్న వాటిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని భారత్ 6జీ 2025 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఫలితంగా 2035 నాటికి భారత ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని చంద్రశేఖర్ చెప్పారు. దేశీయంగా 6జీని అభివృద్ధి చేసుకోవడం వల్ల మన కమ్యూనికేషన్స్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.