20 ఏళ్లు.. 2,210 విమానాలు!

India aircraft demand to be around 2210 over next 20 years - Sakshi

భారత్‌కు అవసరం

ఏవియేషన్‌ ట్రాఫిక్‌ ఏటా 6.2% వృద్ధి

ఎయిర్‌బస్‌ అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏవియేషన్‌ మార్కెట్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్‌ ఇండియా ఏవియేషన్‌ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ ఇండియా విభాగం ప్రెసిడెంట్‌ రెమి మెలార్డ్‌ ఈ విషయాలు తెలిపారు.

భారత మార్కెట్‌పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్‌కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్‌ .. సర్వీస్‌ సామర్థ్యాలు, ట్యాక్సేషన్‌ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు.  

అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి
గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్‌ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్‌లైన్స్‌ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్‌ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్‌ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్‌ సంక్షోభం నుంచి భారత్‌ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు.  

34 వేల మంది పైలట్లు కావాలి
విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్‌లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు.  భారత్‌లో ఎయిర్‌బస్‌ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్‌ నుంచి 650 మిలియన్‌ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్‌ డెలివర్‌ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్‌ చేయగా ఇందులో 10% ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్‌ అని తెలిపారు.  

సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు
ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్‌ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్‌ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top